దసరా పండుగ రోజున ఆయుధ పూజను ప్రధానంగా నిర్వహిస్తూ ఉంటారు. ఆయుధ పూజ అంటే ఏమీ లేదు.. మన జీవనోపాధి కోసం ఉపయోగించే పనిముట్లను పూజించడం. ఆయుధ పూజ అనేది ప్రధానంగా భారతదేశంలోని దక్షిణాది రాష్ట్రాల్లో, ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లో హిందువులు దసరా పండుగ రోజున జరుపుకుంటూ ఉంటారు. ముందురోజు సాయంత్రం ఈ పనిముట్లను దైవానికి ఒక బలిపీఠంపై ఉంచడం సంప్రదాయం. ప్రతి రోజు ఉపయోగించే సాధనాలు, వస్తువులలో దైవత్వాన్ని చూస్తూ ఈ ఆయుధ పూజ చేయడం జరుగుతుంది.
ఆయుధ పూజ చేయాలనుకునే వ్యవసాయ ఉపకరణాలు, యంత్రాలు, వాహనాలు, కంప్యూటర్లు వంటి వస్తువులను ముందుగానే శుభ్రపరుస్తారు. అనంతరం వాటిని పసుపు, కుంకుమ పూలతో అలంకరించి పూజ నిర్వహిస్తారు. పూర్వం మహాభారత కాలంలో పాండవులు జమ్మి చెట్టు మీద నుంచి దసరా పండుగ రోజున తమ ఆయుధాలను బయటకు తీసి పూజ చేసి కథన రంగంలోకి దిగి విజయం సాధించారు. కాబట్టి ఈ రోజున ఆయుధ పూజ నిర్వహిస్తే మనకు తిరుగు ఉండదని కూడా ప్రజల నమ్మకం. ఆయుధ పూజ అనేది ప్రజల జీవితాలలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న పనిముట్లు, సాధనాల వేడుకగా కూడా చెప్పవచ్చు.