కోటప్పకొండపై శివుడు కొలువయ్యాడని తెలుసుకున్నాం కదా. అసలు శివుడు కొండ దిగకపోవడానికి కారణమేంటో తెలుసుకుందాం. కోటప్ప కొండ క్షేత్రంపై శివుడు తపస్సు చేస్తుండగా ఆనంద వల్లి అనే గొల్లభామ ప్రతిరోజూ పాలు, తేనెలతో శివుని సేవిస్తూ ఉండేదట. ఒకరోజు శాలంకయ్య అనే రైతు శివుడు తపస్సు చేసే ప్రాంతానికి వచ్చాడట. అతనికి శివుడు బాలయోగిలా, దక్షిణామూర్తి స్వరూపంలో కనిపించాడట. వెంటనే శాలంకయ్య శివుడికి భక్తితో నమస్కరించి తన దగ్గర ఉన్న పండ్లను స్వామికి సమర్పించి తన ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించాలని వేడుకున్నాడట.
సరేనని చెప్పి శాలంకయ్యను ఇంటికి వెళ్లమని శివుడు చెపపాడట. మరోవైపు గొల్లభామ ఆనందవల్లి గర్భవతై ‘కొండకు రాలేకపోతున్నానని.. తండ్రీ, నీవే క్రిందకు రా’ అని శివుడిని వేడుకుందంట. ఆమె మొర ఆలకించిన శివుడు తాను కిందకు వస్తానని.. తాను వచ్చేవరకూ వెనక్కి తిరిగి చూడవద్దని చెప్పాడు. గొల్లభామ నడుచుకుంటూ వెళుతుండగా శివుడు వెనుక నడుస్తున్నాడు. శివుడు అడుగుకు కొండలు పగిలి భీకర శబ్దం వినిపించిందట. దీంతో ఏం జరిగిందోనన్న భయంతో గొల్లభామ శివుడు చెప్పిన మాట మరిచి వెనక్కి తిరిగిందట. ఇక అంతే శివుడు అక్కడే లింగరూపుడిగానూ.. గొల్లభామ శిలగానూ మారిపోయిందట.