జ్ఞాన భూమికల్లో చివరి మూడు ఏం చెబుతున్నాయంటే..

సూర్యుని నుంచి వచ్చే ఏడు కిరణాలను సప్త జ్ఞాన భూమికలుగా అభివర్ణిస్తూ ఉంటాం. వాటిలో తొలి నాలుగింటి గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు చివరి మూడింటి గురించి తెలుసుకుందాం.

అసంసక్తి : దివ్యచక్షువు ఉత్తేజితమవుతున్న స్థితి. తనువు, మరి సంసారం,రెండూతాత్కాలికమైనవే అని సంపూర్ణంగా తెలుసుకున్న స్థితి. కనుక, ఈ రెంటి మీద పూర్తిగా అనాసక్తి పొందిన స్థితి; అదే అసంసక్తి. దీన్నే పద్మపత్రమివాంభసా అన్నాడు కృష్ణుడు గీతలో. అయితే ఇతనికి సంసారంలో అసంసక్తి వున్నా, ధర్మ-నిష్టుడు, మరి కర్మ – నిష్టుడు; తనువు పట్లా, మరి సంసారం పట్లా తటస్థ దృష్టి కలిగి వున్నవాడు. దివ్యచక్షువు ఉత్తేజితమైంది కనుక, సత్యద్రష్ట కాబోతున్నాడు కనుక, పూర్తిగా దాని మీదే ఆసక్తినీ, ఏకాగ్రతనూ నిలిపినివాడు. ఇదే అసంసక్తి. ఇతనినే బ్రహ్మవిద్వరుడు అంటాం.

పదార్ధభావని : అంటే దివ్య చక్షువును క్షుణ్ణంగా ఉపయోగించు కుంటున్నవాడు. ప్రతి పదం యొక్క అర్ధంలో, ప్రతి వస్తువు యొక్క భావంలో ప్రత్యక్షంగా నివసిస్తున్న వాడు. అంటే బ్రహ్మవిద్వరీయుడు అయిన స్థితి. ఇదే సిద్ధస్థితి; ఇదే సవికల్ప సమాధిస్థితి కూడా. అంటే ఎన్నో సమాధానాలు దొరికినా ఇంకా కొద్దిగా, సంశయాలు వున్న స్థితి.

తురీయం : ఇది మానవుని పూర్ణవికాసస్థితి, సిద్ధుడు బుద్ధుడు అయిన స్థితి. అందరినీ యోగులుగా, సిద్ధులుగా, బుద్ధుళ్ళుగా మలచడానికి కంకణం కట్టుకొని, తత్ పరిశ్రమలో పూర్తిగా నిమగ్నమై వున్నవాళ్ళనే బుద్ధుడు అంటాం. ఇదే సహస్రదళ కమలం .ఒక్కొక్క మనిషినీ యోగిగా మలచి నప్పుడల్లా సహస్రదళకమలంలో ఒక్కొక్క రేకు విచ్చుకుంటుంది. ఇతనినే బ్రహ్మ విద్వరిష్టుడు అంటాం.తురీయం అంటే సర్వసామాన్యమైన జాగృత, స్వప్న, సుషుప్త స్థితులను దాటినవాడు. తురీయ అంటే మూడింటినీ దాటిన అని అర్థం. అంటే నిర్వికల్పసమాధి స్థితి కి చేరుకున్న స్థితి. సమాధి అంటే సమాధానాలు తెలుసుకున్న స్థితి. నిర్వికల్ప సమాధి అంటే ఏ సందేహాలూ, ఏ సంశయాలూ లేని స్థితి.

Share this post with your friends