తిరుమల అన్నమయ్య భవనంలోని మీటింగ్ హాల్‌లో శుక్రవారం జరిగిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో భాగంగా 33 మంది భక్తులు అడిగిన ప్రశ్నలకు ఈవో సమాధానాలు ఇచ్చారు. టీటీడీ ట్రస్ట్‌లకు విరాళాలు ఇచ్చిన దాతలను దర్శనానికి ఎక్కడి నుంచి పంపుతారని ప్రశ్నించగా.. సుపథం నుంచి శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారని ఈవో తెలిపారు. శ్రీవారి ఆలయంలో తోపులాట ఎక్కువగా ఉంది. ఆడవాళ్లు, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, చర్యలు తీసుకోవాలని ఓ భక్తుడు కోరగా.. టీటీడీ విజిలెన్స్ విభాగము, అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకుంటారని వెల్లడించారు. శ్రీవారిని దూరం నుంచి చూడటం వల్ల వయసు రీత్యా కనిపించడం లేదు కాబట్టి వీలైనంత దగ్గరగా దర్శనం కల్పించాలని ఓ భక్తుడు కోరగా.. రద్దీ అధికంగా ఉండడం వలన దగ్గరగా దర్శనం కల్పించడం వీలుకాదన్నారు.
తిరుపతి శ్రీ కోదండరామ స్వామివారి ఆలయం మూలమూర్తుల పాదాల వద్ద హనుమంతుడి విగ్రహం కనిపించేలా ఉంచాలని కోరగా.. సంబంధిత అధికారులతో మాట్లాడి ఏర్పాటు చేస్తామన్నారు. తిరుమలలోని వసతి గదులలో ఎలుకలు ఉన్నాయని.. శ్రీవారి ప్రసాదాలను తింటున్నాయన్నారు. అందువల్ల ఇంటికి తీసుకు వెళ్లలేక పోతున్నామన్నారు. మీరు వెంటనే టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేస్తే తనిఖీలు చేసి సమస్యలు పరిష్కరిస్తామని ఈవో తెలిపారు. సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ తదితర కేంద్ర భద్రత బలగాలకు శుభథం ద్వారా దర్శనం కల్పించాలని కోరగా.. ఇప్పటికే ఆ ప్రతిపాదన ఉందని.. పరిశీలిస్తామన్నారు. ఇటీవల ఆన్ లైన్‌లో సుప్రభాత సేవ దొరికిందని.. కానీ తాను నడవలేనని.. కాబట్టి స్వామివారి దర్శనం కల్పించాలని ఓ భక్తుడు కోరగా.. బయోమెట్రిక్ ద్వారా మీకు స్వామి వారి దర్శనం కల్పిస్తామన్నారు.