అమావాస్యకో రంగులో.. పౌర్ణమికి ఒక రంగులో కనిపించే సోమేశ్వరుడి గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఆలయ విశేషాల గురించి తెలుసుకుందాం. ఈ ఆలయం రెండు అంతస్తులుగా ఉంటుంది. కింది అంతస్తులో సోమేశ్వరుడు.. పక్కన పార్వతి దేవి ఉంటారు. పై అంతస్తులో అన్నపూర్ణాదేవి కొలువై ఉంటారు. ఇలా శివుడి పైన అమ్మవారు ప్రతిష్టితమై ఉండటం దేశంలో మరెక్కడా లేదని చెబుతారు. ఈ ఆలయానికి క్షేత్రపాలకుడిగా జనార్ధన స్వామిని పేర్కొంటారు. ఈ ఆలయాన్ని పంచ నందీశ్వరాలయం అని కూడా పేర్కొంటారు.
ఈ ఆలయంలో ఐదు నందులు ఎక్కడెక్కడ ఉంటాయంటే.. దేవాలయం ముందు భాగంలో రెండు నందులు ఉండగా.. ధ్వజస్తంభం వద్ద మరో నంది.. ఆలయ ప్రాంగణంలో ఒక నంది, దేవాలయం ఎదురుగా ఉన్న చంద్ర పుష్కరిణిలో మరో నంది ఉంటుంది. అందువల్లే ఈ క్షేత్రానికి పంచనందీశ్వర దేవాలయం అని కూడా పేరు వచ్చింది. ఈ క్షేత్రంలో ఉండే పుష్కరిణిని చంద్ర పుష్కరిణిగా పేర్కొంటారు. దీనిలో స్నానమాచరిస్తే పాపాలన్నీ పటాపంచలవుతాయని నమ్మకం. ఈ ఆలయాన్ని మూడో శతాబ్దంలో చాళుక్య రాజైన భీముడు నిర్మించాడు. ఈ దేవాలయానికి ప్రాకారాలను, గోపురాన్ని నిర్మించాడనడానికి చారిత్రక ఆధారాలు కనిపిస్తున్నాయి. అందువల్లే ఈ క్షేత్రానికి భీమారామం అనే పేరు కూడా ఉంది. ఇక్కడ మహా శివరాత్రితో పాటు దేవీనవరాత్రులను అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు.