
సూర్యుని నుంచి ఏడు కిరణాలు వస్తాయి. వాటిని సప్త జ్ఞాన భూమికలుగా అభివర్ణిస్తారు. అలాగే జ్ఞానంలో సైతం ఏడు స్థితులున్నాయి. వీటినే సప్త జ్ఞాన భూమికలు అని పిలుస్తారు. అవేంటంటే..
(1) శుభేచ్ఛ
(2) విచారణ
(3) తనుమానసం
(4) సత్త్వాపత్తి
(5) అసంసక్తి
(6) పదార్ధభావని
(7) తురీయం
ఇప్పుడు ఈ ఏడింటిలో తొలి నాలుగింటి గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాం.
1)శుభేచ్ఛ : నాకు బ్రహ్మజ్ఞానం కావాలి అన్న ఇచ్ఛ; నేను శాశ్వత దుఃఖరాహిత్య పదవి పొందాలి అన్న తీవ్ర ఆకాంక్ష.
2)విచారణ : బ్రహ్మజ్ఞాన ప్రాప్తి ఏ విధంగా పొందాలి? అన్న మీమాంస; బ్రహ్మజ్ఞాన ప్రాప్తి విధానమే – ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం అని తెలుసుకోవడం.
3)తనుమానసం : ఇంక విచారణ ద్వారా సాధనా మార్గం తెలుసుకున్నాం గనుక, తత్ సాధనలో నిమగ్నులై ఉండడమే తనుమానసం. అంటే, ధ్యాన, స్వాధ్యాయ, సజ్జన సాంగత్యాలకు ఏ రోజూ విఘ్నం లేకుండా గడపడం. అదే తనుమానసం.
4)సత్త్వాపత్తి : శుద్ధసాత్త్వికం సాధించడమే సత్త్వాపత్తి, అంటే తమోగుణం, రజోగుణం అన్నవి పూర్తిగా శూన్యమైన స్థితి. ఇక మిగిలింది శుద్ధ సాత్త్వికమే. తమోగుణం అంటే సోమరితనం, రజోగుణం అంటే నాకు తెలుసు అనే అధికార దర్పం. ఈ నాల్గవ జ్ఞానభూమిక ధ్యాన, స్వాధ్యాయ, సజ్జన సాంగత్యాల సాధన తీవ్రస్థాయి నందుకునే స్థితి; ఆ తీవ్రత ద్వారా నాడీమండలం పూర్తిగా శుద్ధమైన స్థితి.. మనస్సు పూర్తిగా కంట్రోలు అయిన స్థితి.. అదే యోగి అయిన స్థితి. అహం బ్రహ్మాస్మి అని చక్కగా సిద్ధాంతపరంగా తెలుసుకున్న స్థితి. బ్రహ్మవిదుడు అయిన స్థితి.
