అమ్మవారు ఎనిమిది రూపాలను ఎందుకు ఎత్తిదో తెలుసుకున్నాం కదా.. ఇప్పుడు ఆ ఎనిమిది రూపాల గురించి తెలుసుకుందాం. మొదటిది ఆదిలక్ష్మి స్వరూపం. ప్రాణులకు మూలాధారమైన శక్తి ప్రాణశక్తి. ఈ శక్తిని మనకు ప్రసాదించి శారీరక, మానసిక ఆరోగ్యాలు పరిపూర్ణంగా ఉండాలంటే ఈ అమ్మవారి అనుగ్రహం ఉండాలి. అమ్మవారి రూపాల్లో రెండవది ధాన్యలక్ష్మి స్వరూపం. పుట్టిన బిడ్డకు స్తన్యాన్ని అందించి ఆకలి తీర్చే అమ్మవారు ధాన్యలక్ష్మి దేవి. పాడి పంటలను ప్రసాదించే తల్లిగా అమ్మవారిని పేర్కొంటారు. అమ్మవారి రూపాల్లో మూడవది ధైర్యలక్ష్మి. మనకు అవసరమైన శారీరక, మానసిక బలాన్ని ప్రసాదిస్తుంది.
అమ్మవారి రూపాల్లో నాలుగవది గజలక్ష్మి అవతారం. ముత్తైదువులు ఈ అమ్మవారిని వైభవ లక్ష్మి రూపంలో గజలక్ష్మిని పూజించి అఖండ సౌభాగ్యాన్ని పొందుతారు. అమ్మవారి రూపాల్లో ఐదవది సంతాన లక్ష్మి అవతారం. స్త్రీకి మాతృత్వం అనే వరాన్ని ప్రసాదించేది ఈ అమ్మవారే. అమ్మవారి రూపాల్లో ఆరవది.. విజయలక్ష్మి స్వరూపం. మనకు విజయాలను ప్రసాదించేది విజయలక్ష్మి రూపం. మనం చేసే ఏ పనిలో అయినా విజయం సాధించాలంటే ఈ అమ్మవారి కరుణతోనే.. అష్ట లక్ష్మీ రూపాల్లో ఏడవది విద్యాలక్ష్మి స్వరూపం. సమాజంలో గుర్తింపు, గౌరవం పొందాలన్నా, వివేకం, బుద్ధి జ్ఞానం వంటివన్నీ మనకు ప్రసాదిస్తుంది. శ్రీ మహాలక్ష్మీదేవి అష్ట లక్ష్మి రూపాల్లో ఎనిమిదవది, చివరిది ధన లక్ష్మీ అవతారం. మనం అష్టైశ్వర్యాలతో జీవించాలంటే ఈ అమ్మవారి కరుణ ఉండాల్సిందే.