భోగి పండుగకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకున్నాం కదా.. శ్రీ రంగనాథ స్వామిలో గోదా దేవి లీనమై భోగాన్ని పొందిందని చెబుతారు. దీనికి సంకేతంగానే భోగి పండుగ జరుపుకోవడం సంప్రదాయంగా మారిందని చెబుతారు. ఈ భోగి మంటల అంతరార్ధం ఏంటనే ఇప్పుడు తెలుసుకుందాం. సూర్యుడు దక్షిణాయణం నుంచి ఉత్తరాయణంలోకి పయనించినప్పుడు సంక్రాంతి పండుగను జరుపుకుంటామని తెలుసుకున్నాం కదా. ఈ గడిచిన దక్షిణాయనంలో తాము పడిన కష్టాలు, బాధలనేవి ఏవీ కూడా కొత్త సంవత్సరంలో ఉండకూడదని కోరుకుంటూ భోగి మంటలను వేస్తారు.
శాస్త్రీయ పరంగా చూస్తే సూర్యుడు దక్షిణయాణంలో భూమికి దూరంగా ఉంటాడు. దాని వల్ల ఉష్ణోగ్రతలు తగ్గి చలి తీవ్రత పెరుగుతుంది. ఈ చల్లని వాతావరణాన్ని తట్టుకునేందుకు, చలి బాధల నుంచి తప్పించుకునేందుకు కూడా భోగి మంటలు వేస్తారు. భోగి మంటల కారణంగా ఆరోగ్య ప్రయోజనాలు సైతం ఉన్నాయట. సంక్రాంతి పండుగకు నెల రోజుల ముందు ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేసి వాటిని భోగి మంటల్లో వేస్తారు. పిడకలు మంటల్లో కాలడం వలన వచ్చే పొగ కారణంగా గాలి శుద్దై సూక్ష్మక్రిములు నశిస్తాయట. ఈ పొగను పీలిస్తే శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.