
తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం పరిధిలో వెలసిన బూరుగు గడ్డ వేణుగోపాల స్వామి ఆలయం గురించి తెలుసుకున్నాం కదా. ఇక్కడ గర్భాలయంలో ఆది వరాహ లక్ష్మీ నరసింహ వేణుగోపాలస్వామి దర్శనమిస్తుంటారు. ఈ ఆలయంలో ఆసక్తికరంగా గోదాదేవి అమ్మవారిని ముందుగా దర్శించుకున్న తరువాతనే ప్రధాన ఆలయంలోని మూర్తులను దర్శించుకోవాలని తెలుసుకున్నాం కదా. ధనుర్మాసంలో ఇక్కడి వేణుగోపాల స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. భోగి పండుగ రోజు జరిగే గోదాదేవి కల్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు.
గోదాదేవి కల్యాణోత్సవాన్ని తిలకించడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. ‘కృష్ణాష్టమి’ వేడుక కూడా ఇక్కడ కనుల పండుగగా జరుగుతుంది. ఆ సమయంలో కృష్ణుడి దివ్య మంగళ స్వరూపం చూసేందుకు రెండు కళ్లూ చాలవు. సాధారణంగా ఏదైనా వైష్ణవ క్షేత్రాల్లో 12 మంది ఆళ్వారుల మూర్తులు చాలా చిన్నవిగా ఉంటాయి. కానీ ఈ క్షేత్రంలో మాత్రం ఆళ్వారులు వరుసగా భోజనానికి కూర్చున్నట్టుగా సజీవంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఆలయ ప్రాంగణంలో తీర్థంగా ‘సూర్య పుష్కరిణి’, స్వామివారి కైంకర్యాల కోసం ‘చంద్ర పుష్కరిణి’ నీటిని వినియోగిస్తూ ఉంటారు. ఆలయం లోపల చంద్ర పుష్కరిణి ఉంటుంది.
