తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి సన్నిధిలో వివాహం చేసుకోవాలని ఎవరికి ఉండదు? కొందరు మొక్కుకుంటారు. మరికొందరు తమ వివాహ బంధం కలకలం పదిలంగా ఉండాలని కోరుకుంటూ చేసుకుంటారు. మరికొందరు మాత్రం తిరుమలలో వివాహం చేసుకోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని అని భావించి.. అంత ఖర్చు పెట్టలేక తమ ఇంటి వద్దనే వివాహం చేసుకుని ఆ పెళ్లి బట్టల్లోనే స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. మరి తిరుమల శ్రీ మలయప్ప స్వామివారి సన్నిధిలో వివాహం చేసుకునేందుకు ఎంత ఖర్చు అవుతుందో తెలుసా?
శ్రీవారి సన్నిధిలో పెళ్లి చేసుకోవాలనుకునే వారికి తిరుమలలోని కల్యాణ వేదికలో ఉచితంగానే తిరుమల తిరుపతి దేవస్థానం కల్యాణం జరిపిస్తోంది. దీని కోసం ఎలాంటి రుసుమూ చేల్లించాల్సిన పని లేదు. ఇక కల్యాణం కాకుండా ఇతర కార్యక్రమాల కోసం మాత్రం కొంత మేర రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఉపనయనం కోసం రూ. 300, సత్యనారాయణ వ్రతానికి రూ. 300, ఇతర పూజలకు రూ.200 చెల్లించాలి. ఇక తిరుమలలో వివాహం చేసుకోవాలనుకునే వారు.. వధువు, వరుడు పుట్టిన తేదీలు, విద్యార్హత పత్రాలు, తల్లిదండ్రుల ఆధార్ కార్డులు, శుభలేఖ, లగ్నపత్రికను సమర్పించాల్సి ఉంటుంది. అలాగే ఈ వివాహానికి వధువు, వరుడి తల్లిదండ్రులు తప్పనిసరిగా హాజరు కావాలి. ఒకవేళ వీరిద్దరి తల్లిదండ్రులలో ఎవరైనా మరణించి ఉంటే మాత్రం మరణ ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి.