శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలకు నేడు అంకురార్పణ జరగనుంది. నేటి సాయంత్రం శ్రీ మలయప్ప స్వామివారి ఆలయంలో అంకురార్పణ కార్యక్రమాన్ని వేద పండితులు, ఆలయ అర్చకులు నిర్వహించనున్నారు. రేపటి నుంచి మూడు రోజుల పాటు శ్రీవారి ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో పవిత్రోత్సవాలను నిర్వహించనున్నారు. పవిత్రోత్సవాలు నేపథ్యంలో శ్రీవారి ఆలయంలో జరిగే పలు ఆర్జిత సేవలను మూడు రోజుల పాటు తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది. రాత్రి 7 గంటలకు మాడవీధులలో శ్రీ వేంకటేశ్వర స్వామివారి సర్వసేనాధిపతి విష్వక్సేనుడు ఊరేగనున్నాడు.
ఇవాళ అంకురార్పణ కార్యక్రమంలో భాగంగా శ్రీవారి ఆలయంలో సహస్రదీపాలంకరణ సేవను టీటీడీ రద్దు చేసింది. శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈ నెల 15 నుంచి పవిత్రోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 18 వరకూ ఈ పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలోని సంపంగి ప్రాకారంలో వైదిక కార్యక్రమాలు 17వ తేది రాత్రి వరకు జరగనున్నాయి. ఈ కారణంగా 18వ తేదీ కళ్యాణోత్సవాన్ని టీటీడీ రద్దు చేసింది. కాగా.. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఇక రేపటి నుంచి వరుస సెలవుల నేపథ్యంలో మరింత రద్దీ పెరిగే అవకాశం ఉంది.