శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ ఈవో కీలక సూచనలు..

తిరుమలలో భక్తులు అనవసరంగా వేచి ఉండకుండా ఉండేందుకు ఎస్‌ఈడీ టికెట్స్, ఎస్‌ఎస్‌డీ టోకెన్లపై కేటాయించిన సమయాన్ని పాటించాలని టీటీడీ ఈవో శ్రీ జె. శ్యామలరావు శుక్రవారం భక్తులకు విజ్ఞప్తి చేశారు. చాలా మంది భక్తులు తమ ఎస్‌ఎస్‌డీ టోకెన్‌లు, ఎస్‌ఈడీ టికెట్లపై కేటాయించిన సమయం కంటే చాలా ముందుగా శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి రావడంతో, వారు చాలా గంటలు వేచి ఉండవలసి వస్తోందన్నారు. టీటీడీ గత కొన్ని రోజులగా భక్తుల టోకెన్లు లేదా టికెట్లపై పేర్కొన్న విధంగా వారికి కేటాయించిన సమయంలో మాత్రమే దర్శన క్యూ లైన్లలోకి ప్రవేశించడానికి అనుమతిస్తోంది.

కానీ, ఇప్పటికీ చాలా మంది భక్తులు చాలా ముందుగానే తిరుమలకు వచ్చి ఆరుబయట వేచి ఉండి ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. డయల్ యువర్ ఈఓ కార్యక్రమం ద్వారా, భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా సమయపాలన పాటించాలని టీటీడీ ఈవో విజ్ఞప్తి చేశారు. తిరుమలలో భక్తుల సమాచారం కోసం ఇప్పటికే తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, ఇంగ్లిష్‌తో సహా మొత్తం ఐదు భాషల్లో ప్రకటనలు చేస్తున్నామన్నారు. నేటి నుంచి తిరుపతి రైల్వేస్టేషన్‌, బస్టాండ్‌లతో పాటు శ్రీనివాసం, విష్ణు నివాసం, అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద కూడా కూడా భక్తుల సమాచార నిమిత్తం ప్రకటనలు ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. భక్తులు క్యూ లైన్ల వెలుపల వేచి ఉండకుండా, తిరుపతిలోని స్థానిక ఆలయాల సందర్శన లేదా తిరుమలలోని ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించవచ్చని ఈవో తెలిపారు.

Share this post with your friends