శ్రీవారి భక్తులుగా టీటీడీ ఉద్యోగులు… కారణమేంటంటే..

తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు టీటీడీ నిర్ణయించిన ధరలకే వస్తువులను దుకాణదారులు విక్రయించాలని, అధిక ధరలు విక్రయిస్తే చట్టపరంగా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ ఒక ప్రకటనలో తెలియజేసింది. టీటీడీ ఈవో ఆదేశాల మేరకు, జేఈఓ శ్రీ వీరబ్రహ్మం పర్యవేక్షణలో శనివారం టీటీడీ ఉద్యోగులు భక్తుల వలె శ్రీవారి మెట్టు వద్ద ఉన్న షాప్ నంబర్-3లో గాజు సీసా నీటి బాటిల్ రూ.50/- కొనుగోలు చేశారు. అనంతరం కాళీ గ్లాస్ బాటల్ తిరిగి షాపు యజమానికి ఇవ్వగా రూ.20/- రూపాయలు వెనుకకు ఇచ్చారు. వాస్తవంగా రూ.30/- తిరిగి ఇవ్వాలి. కావున వస్తువులను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు.

అదేవిధంగా వీరు కొనుగోలు చేసిన దుకాణంలో తక్కువ నాణ్యత కలిగిన ప్లాస్టిక్ బాటిల్స్ కూడా నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తున్నట్లు గమనించారు. గతంలో ఇదే షాపు యజమాని టిటిడి నిబంధనలకు వ్యతిరేకంగా అనుసరిస్తున్న విధానాలకు ఇదివరకే షాప్ నెంబర్ -3 శ్రీ వినోద్ కుమార్ కు షోకాజ్ నోటీసులు జారీ చేసి, రూ.25,000 జరిమానా విధించి హెచ్చరించటం జరిగింది. అయినా ఆ షాపు యజమాని తన ధోరణి మార్చుకోలేదని, ధరల పట్టిక ప్రదర్శించడం లేదని పై అధికారులకు నివేదిక అందజేశారు. ఈ నేపథ్యంలో, సదరు వ్యక్తి తన దుకాణంలో మరోసారి టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు విక్రయించిన ఎడల అతని దుకాణాన్ని సీజ్ చేయడం జరుగుతుందని సంబంధిత అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా దుకాణదారులు వస్తువులను భక్తులకు అధిక ధరలకు విక్రయించి వారిని మోసం చేసిన ఎడల, టీటీడీ టెండర్ నిబంధనలు అతిక్రమించిన ఎడల, అట్టి దుకాణదారుల లైసెన్స్ రద్దు చేయబడుతుందని హెచ్చరించారు.

Share this post with your friends