తిరుమలకు వచ్చే భక్తులందరికీ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు హెచ్చరికలు జారీ చేశారు. పవిత్రమైన తిరుమల క్షేత్రంలో అక్కడి ప్రశాంతతను దెబ్బతీసేలా వ్యవహరించినా.. కొండపై ఎవరు రాజకీయ వ్యాఖ్యలు చేసినా ఉపేక్షించేది లేదని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బీఆర్ నాయుడు తాజాగా ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తిరుమల ఒక పవిత్ర క్షేత్రమని, ఇది రాజకీయ వేదిక కాదని.. కాబట్టి ఇకపై ఎవరు రాజకీయ వ్యాఖ్యలు చేసిన సహించబోమని స్పష్టం చేశారు.
తిరుమలను వేదికగా చేసుకుని రాజకీయ వ్యాఖ్యానాలు, ఆరోపణలు, విమర్శలు చేయడాన్ని టీటీడీ ధర్మకర్తల మండలి తొలి సమావేశంలోనే నిషేధిస్తూ తీర్మానం చేశామని బీఆర్ నాయుడు వెల్లడించారు. ఈ మేరకు కొండపై రాజకీయ వ్యాఖ్యలకు స్థానం లేదని స్పష్టం చేశారు. అలా ఎవరైనా చేస్తే ఉపేక్షించబోమన్నారు. తెలంగాణకు చెందిన ఒక నేత తిరుమల వేదికగా రాజకీయ వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని ఆయనపై కూడా చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తున్నట్టుగా ఆయన తెలిపారు. ఈ క్రమంలోనే ఇక మీదట ఎవరూ ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు కానీ, తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా వ్యవహరించకూడదని ఆదేశాలు జారీ చేశారు.