శ్రీవారి భక్తులకు వైకుంఠ ఏకాదశి వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పించడంలో భాగంగా టీటీడీ తిరుపతిలో ఏర్పాటు చేసిన కౌంటర్లలో జనవరి 8వ తేది రాత్రి బైరాగి పట్టెడలోనూ మరియు విష్ణువాసం కౌంటర్లలో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన ఆరుగురు భక్తులు మృతికి టీటీడీ బోర్డు సంతాపం తెలిపింది. తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం సాయంత్రం అత్యవసర సమావేశాన్ని టీటీడీ బోర్డు నిర్వహించింది. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో టీటీడీ చైర్మన్ శ్రీ బి ఆర్ నాయుడు మాట్లాడుతూ బుధవారం రాత్రి జరిగిన సంఘటన అందరినీ కలచి వేసింది అన్నారు. ఈ దురదృష్ట సంఘటనలో మృతి చెందిన వారి పవిత్ర ఆత్మలకు శాంతి కలగాలని ఆ దేవదేవుని మనస్ఫూర్తిగా మేమందరం ప్రార్థిస్తున్నామని తెలిపారు.
‘‘గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మరణించిన వారి కుటుంబాలకు 25 లక్షలు, తీవ్రంగా గాయపడిన వాళ్లకి 05 లక్షలు, చికిత్స పొందుతున్న వారికి 02 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇచ్చేందుకు నిర్ణయించాం. అదేవిధంగా మృతుల పిల్లలకు ఉచిత విద్యను కూడా టిటిడి విద్యాసంస్థల్లో ఇవ్వడానికి మా బోర్డు నిర్ణయించింది. టీటీడీ బోర్డు సభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మరియు శ్రీమతి సుచిత్ర ఎల్లా చెరో 10 లక్షలు, శ్రీ ఎమ్మెస్ రాజు 3 లక్షల రూపాయలు మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు వ్యక్తిగతంగా ఆర్థిక సహాయం అందిస్తున్నారు’’ అని టీటీడీ చైర్మన్ తెలిపారు.