
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీ తిరుమంగై ఆళ్వార్ ఉత్సవం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే గోవిందరాజ స్వామివారి ఆలయంలో రేపు అంటే డిసెంబరు 13వ తేదీ శ్రీ తిరుమంగై ఆళ్వార్ సాత్తుమొర జరుగనుంది. ఈ ఆలయంలో డిసెంబరు 4 నుంచి శ్రీ తిరుమంగై ఆళ్వార్ ఉత్సవం జరుగుతోంది. ఈ క్రమంలోనే సాత్తుమొర సందర్భంగా డిసెంబరు 13న సాయంత్రం 5.30 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు, శ్రీ తిరుమంగై ఆళ్వార్ ఆలయ మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు.
ఆళ్వారుల పరంపరలో ఆఖరి వాడైన శ్రీ తిరుమంగై ఆళ్వార్‌ను శ్రీవారి ధనుస్సు అయిన సారంగి అంశగా పేర్కొంటారు. తిరుమంగై ఆళ్వార్ ఒక్కరే భువిలో ఉన్న నూట ఆరు దివ్యదేశాలను సందర్శించారని వారి శిష్యులు చెబుతారు. స్వామివారిని కీర్తిస్తూ వెయ్యికి పైగా పాశురాలను తిరుమంగై ఆళ్వార్ గానం చేశాడు. కాబట్టి శ్రీ తిరుమంగై ఆళ్వార్ ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
