ఏదైనా శుభకార్యం నిర్వహించినప్పుడు తాంబూలమివ్వడం హిందూ సంప్రదాయం. హిందూ కుటుంబాలన్నింటిలో ఇది జరుగుతూనే ఉంటుంది. అయితే ప్రథమ తాంబూలం ఎవరికి ఇవ్వాలనే సంశయం కొందరికి ఉంటుంది. తొలి మర్యాద, గౌరవం అనేవి ఎవరికి వారు తీసుకుంటే వచ్చేవి కాదు.. వయసు, అనుభవం, మనసు, బుద్ధి, సంస్కారం వంటివి వ్యక్తికి గౌరవ మర్యాదలను సంపాదించి పెడతాయి. ప్రతి మనిషిలోనూ మానవత్వం, దివ్యత్వం, దైవత్వం అనే మూడు లక్షణాలుంటాయి. ఈ మూడింటినీ అనుభవంలోకి తెచ్చుకున్న మనిషి అన్నింటా ఆరాధ్యుడవుతాడని పెద్దలు చెబుతారు. విశిష్టుడు, విశ్వామిత్రుడు ఇద్దరూ తపస్సులో సంపన్నులే.. కానీ ప్రథమ తాంబూలం ఎప్పుడూ వశిష్టులవారిదే.
ఇద్దరూ తపస్సంపన్నులే అయినప్పుడు ఒక్కరికే ప్రథమ తాంబూలం ఏంటి? అంటారా? ప్రథమ తాంబూలమే కాదు.. బ్రహ్మర్షిగానూ వశిష్టుల వారు గౌరవాన్ని పొందారు. మరి విశ్వామిత్రులవారికి ఏం తక్కువైంది? అంటే ఆయన కామక్రోధాదులను జయించలేకపోయారు. మేనకతో సంసారం జీవితంతో పాటు త్రిశంకు స్వర్గాన్ని సృష్టించడం.. అలాగే హరిశ్చంద్రుడితో అబద్దమాడించి తీరతానంటూ శపథాలు చేయడం వంటి వాటి కారణంగా తన తపశ్శక్తిని మొత్తం విశ్వామిత్రుల వారు వృథా చేసుకున్నారు. అయితే ఆయనలోని అహంకారాన్ని వదిలేశాక మాత్రం ఆయన కూడా బ్రహ్మర్షిగా గౌరవాన్ని అందుకున్నారు. కాబట్టి శాంత స్వభావం, మానసిక ప్రశాంతత, మనో నిగ్రహం, భగవత్ చింతన, అంతఃకరణ శుద్ధి మనిషికి ఉండాల్సిన ఐదు లక్షణాలు. ఇవి ఉన్న వారికే ప్రథమ తాంబూలం.