మనసు నిలకడగా ఉండాలంటే ఈ లింగం దగ్గర కాసేపు ధ్యానం చేయాలట..

అరుణాచలం పరమేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపం కావడంతో దీని చుట్టూ ప్రదక్షిణం చేయడమంటే సాక్షాత్తు శివునికి చేసినట్టే అని భక్తజన విశ్వాసం. పాదచారులై శివస్మరణ గావిస్తూ ప్రదక్షిణ చేసే వారికి మహాపుణ్యం దక్కుతుందని మహాత్ముల వచనం. అందుకే నిత్యం ఎంతో మంది గిరి ప్రదక్షిణ చేస్తారు. గిరి ప్రదక్షిణ చాలావరకు తారు రోడ్డు మీదనే జరుగుతుంది. ఈ మధ్య రోడ్డు పక్కన కాలిబాట కూడా వేశారు. ఉదయం సూర్యతాపాన్ని తట్టుకోవడం కష్టం కాబట్టి చాలామంది రాత్రి పూట లేదంటే తెల్లవారుఝామునే గిరి ప్రదక్షిణ చేస్తారు.

ఈ ప్రదక్షిణ సాధారణంగా రమణ మహర్షి ఆశ్రమం నుంచి మొదలవుతుంది. నాలుగడుగులు వేయగానే వినాయకుడి గుడి ఉంటుంది. అక్కడ నుంచి కొండ పైకి చూస్తే నంది ఆకారంలో కనిపిస్తుంది. దానికి నమస్కారం చేసి గిరి ప్రదక్షిణకు ఉపక్రమిస్తారు. ఇది సుమారు 14 కిలోమీటర్లు ఉంటుంది (మాకు ఐదు గంటల సమయం పట్టింది). కొండ చుట్టూ ఎనిమిది ప్రత్యేక లింగాలు (అష్ట లింగాలు), ఎనిమిది దిక్కుల్లో ఉన్నాయి. ఇంద్ర, అగ్ని, యమ, నైరుతి, వరుణ, వాయు, కుబేర, ఈశాన్య లింగాలివి. ఎముకలు అరిగిపోయిన వారు యమలింగాన్ని దర్శించుకుంటే మంచిదని, మనసు నిలకడగా ఉండాలంటే నైరుతి లింగం వద్ద కాసేపు ధ్యానం చేయాలని చెబుతారు.

ఇవిగాక గిరి ప్రదక్షిణలో మరో నాలుగు ముఖ్య ఆలయాలున్నాయి. అవి భూత నారాయణుడు, జంట వినాయకులు, మలై అమ్మన్‌, పూరీ జగన్నాథ్‌. కుబేర లింగం దాటిన తర్వాత ఇరుకైన ద్వారం వస్తుంది. దీనిని మోక్షద్వారం అంటారు. ఇందులో నుంచి దూరి బయటకు వస్తేనే గిరి ప్రదక్షిణ పూర్తయినట్లుగా చెబుతారు. ఇక్కడక్యూలైన్‌ కాస్త ఎక్కువగానే ఉంటుంది. కాస్త ఓపికగా నిల్చోవాలి. మేమైతే సులువు గానే దూరి బయటకు వచ్చేశాం. అనారోగ్యంతో ఉన్న వారు, వృద్ధులు, గర్భిణులు, పిల్లలు గిరిప్రదక్షిణ చేయడం కష్టం కాబట్టి వారి కోసం ఆటోలున్నాయి. ఒక్కొక్కరికి ఐదువందల రూపాయలు తీసుకుంటారు. గిరి ప్రదక్షిణ చేసేప్పుడు కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది.

Share this post with your friends