తిరుమలలో రంగనాయకుల మండపం ప్రక్కనే ఎత్తైన స్తంభాలతో కూడిన తిరుమలరాయ మండపం ఉంది. ఇక్కడ శ్రీ వేంకటేశ్వర స్వామివారికి ఊంజల్ సేవ నిర్వహిస్తారు. అందుకే దీనిని ఊంజల్ మండపం అని కూడా అంటారు. ఇందులో కొంత భాగాన్ని 1473 ADలో సాళువ నరసింహరాయలు నిర్మించగా, మిగిలిన భాగాన్ని 16వ శతాబ్దంలో అరవేటి తిరుమలరాయ నిర్మించారు. దీనిలో రాజా తోడర్మల్‌తో పాటు ఆయన తల్లి మాతా మోహనా దేవి, భార్య పితా బీబీ లోహ విగ్రహాలు ఉన్నాయి. ధ్వజారోహణం సందర్భంగా జరిగే వార్షిక బ్రహ్మోత్సవాల్లో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి ఉత్సవ విగ్రహాలు ఇక్కడ ప్రత్యేక పూజలు అందుకుంటాయి.
నాలుగు కాళ్ల మండపం
తిరుమలరాయ మండపానికి పశ్చిమాన సంపంగి ప్రదక్షిణ ఆగ్నేయ మూలలో నాలుగు కాళ్ల మంటపం ఉంది. దీనిని సాళువ నరసింహరాయలు క్రీ.శ.1470 ADలో తన కుటుంబ సభ్యుల పేరిట నిర్మించారు. ‘ఉట్లపండుగ’ రోజున ఈ మండపంలో శ్రీకృష్ణ స్వామిని పూజిస్తారు. ఈ ఉత్సవాన్ని ‘శిక్యోత్సవం’ అని కూడా పిలుస్తారు.