కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి భక్తులకు సేవ చేసేందుకు ఇటీవల టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు ఈవో శ్రీ జె.శ్యామలరావు చెప్పారు. తిరుమలకు విచ్చేసే భక్తులందరికీ టీటీడీ అందించే శ్రీవారి దర్శనం, వసతి, ఇతర సౌకర్యాలు మరింత మెరుగ్గా కల్పించేందుకు, అందరి సమన్వయంతో భక్తులకు తిరుమల యాత్ర ఒక దివ్యానుభూతిని కల్పించేలా కృషి చేస్తున్నామని ఆయన తెలియజేశారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఈవో భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు.
టీటీడీ ఈవో శ్రీవారి ఆలయానికి సంబంధించి పలు కీలక విషయాలను వెల్లడించారు. శ్రీవారి పవిత్రోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈ నెల 15న ఈ పవోత్రోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 17వ తేదీ వరకూ జరగనున్నాయి. ఆగస్టు 14న అంకురార్పణంతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్లగానీ తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది.