శ్రీ‌వారి ఆల‌యంలో ముగిసిన జ్యేష్టాభిషేకం.. బంగారు కవచంలో పున‌ర్ద‌ర్శ‌నం

తిరుమల శ్రీవారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన జ్యేష్టాభిషేకం శుక్రవారం ఘనంగా ముగిసింది. చివరిరోజు ఉభయదేవేరులతో కలిసి శ్రీమలయప్పస్వామివారు బంగారు కవచంలో పున‌ర్ద‌ర్శ‌న‌మిచ్చారు. మళ్లీ జ్యేష్టాభిషేకం వరకు సంవత్సరం పొడవునా స్వామి, అమ్మవార్లు ఈ బంగారు కవచంతో ఉంటారు. ఈ సందర్భంగా ఉదయం శ్రీ మలయప్పస్వామివారు ఉభయనాంచారులతో కలిసి శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారానికి వేంచేపు చేశారు. ఆలయ అర్చకులు, వేదపారాయణదారులు శాస్త్రోక్తంగా మహాశాంతి హోమం నిర్వహించారు. శ్రీమలయప్ప స్వామివారికి, దేవేరులకు శ‌త‌క‌ల‌శ తిరుమంజనం చేపట్టారు. అనంతరం స్వర్ణ కవచాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి స్వర్ణ కవచ సమర్పణ వేడుకగా జరిగింది. స‌హ‌స్ర‌దీపాలంక‌ర‌ణ సేవ అనంత‌రం స్వామి, అమ్మ‌వార్లు ఆల‌య నాలుగు మాడ వీధుల్లో భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిచ్చారు. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద‌జీయర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, జేఈవో శ్రీ వీరబ్రహ్మం, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Share this post with your friends