ఈసారి శాకంబరీ ఉత్సవాలు 16 రోజులు.. కారణమేంటంటే..

శ్రీ భద్రకాళి అమ్మవారి శాకంభరి నవరాత్రి మహోత్సవాలు ఇవాళ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నెల 21 వరకూ ఈ ఉత్సవాలు జరగనున్నాయి. అయితే ప్రతి ఏటా ఈ ఉత్సవాలు 15 రోజుల పాటు మాత్రమే జరుగుతాయి. ఈసారి మాత్రం 16 రోజుల పాటు జరగనున్నాయి. ఈ ఏడాది అధిక మాసం కారణంగా ఒకరోజు పెరిగింది. శాకంబరీ ఉత్సవాల చివరి రోజైన 21న పౌర్ణమి కావడంతో అమ్మవారు సంపూర్ణ శాకాంబరీగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ 16 రోజుల పాటు అమ్మవారిని అన్ని రకాల కూరగాయలు, పండ్లు, ఆకు కూరలతో అలంకరించనున్నారు.

ఈ ఉత్సవాల సమయంలో అమ్మవారిని దర్శించుకుంటే కరువు కాటకాలనేవి ఉండవట. పైగా మనం కోరుకున్న ఏ పని అయినా చక్కగా పూర్తవుతుందట. కాగా.. శాకంబరీ ఉత్సవాలు ఆషాఢమాసంలో నిర్వహిస్తూ ఉంటారు. తొలుత భద్రకాళీ అమ్మవారి ఆలయంలో ప్రారంభమవుతాయి. అనంతరం వివిధ ప్రాంతాల్లో ఆలయాల్లో ఈ ఉత్సవాలను ప్రారంభిస్తారు. బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో ఈ నెల 19 నుంచి శాకంబరీ ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఈ నెల 21వ తేదీ వరకూ అంటే కేవలం మూడు రోజుల పాటు మాత్రమే ఉత్సవాలను నిర్వహించనున్నారు. శాకంబరీ ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేయాలని ఈవో ఇప్పటికే సంబంధిత అధికారులు, అర్చకులకు సూచించారు.

Share this post with your friends