
శ్రీరామ భక్త హనుమంతుడిని ఆశ్రయించిన వారికి ఆపదలను ఎదుర్కోగలిగే ధైర్యం, శక్తి, విజయం సమకూరుతాయని నమ్మకం. అయితే ఆంజనేయుడు ఆజన్మ బ్రహ్మచారి అని చెబుతారు. అందుకే ఏ ఆలయంలోనైనా హనుమంతుడు ఒంటరిగానే దర్శనమస్తాడు. అయితే ఆంజనేయుడికి వివాహం జరిగిందని.. ఆయన భార్య పేరు సువర్చల అని పురాణాలు చెబుతున్నాయి. భార్య ఉండగా బ్రహ్మచారి ఎలా అయ్యాడు? అసలెందుకు ఏ ఆలయంలోనూ హనుమంతుడు తన భార్యతో కలిసి కనిపించడు? అంటే ఓ ఆలయంలో మాత్రం కనిపిస్తాడు. అది మరెక్కడో లేదు. మన తెలుగు రాష్ట్రాల్లేన ఉంది. దాని కథేంటో తెలుసుకుందాం.
హిందూ సంప్రదాయం ప్రకారం ఏ దేవుడిని తీసుకున్నా కూడా సతీసమేతంగానే దర్శనమస్తూ ఉంటారు. కానీ హనుమంతుడు మాత్రం ఒంటరిగానే దర్శనమిస్తాడు. ఇక హనుమంతుడు సతీ సమేతంగా దర్శనమిచ్చే ఆలయం తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఉంది. శ్రీ సువర్చల సహిత అభయాంజనేయ స్వామి ఆలయాన్ని ఇల్లందుో 2006లో నిర్మించారు. గర్భాలయంలో ఆంజనేయస్వామి సువర్చలతో కలిసి దర్శనమివ్వడంతో పాటు.. సీతారామలక్ష్మణుల విగ్రహాలను సైతం ఇక్కడ దర్శించుకోవచ్చు. అంతేకాదు.. ఇక్కడ ప్రతి ఏటా జ్యేష్ఠ మాసంలో హనుమాన్ జయంతి రోజు హనుమంతుని కళ్యాణాన్ని వైభవంగా నిర్వహిస్తారు.
