కుంభమేళాలో స్పెషల్ అట్రాక్షన్ ఆమే..

కుంభమేళాలో జరుగుతున్న త్రివేణి సంగమ తీరం భక్తులతో నిండిపోయింది. రోజురోజుకూ స్నానమాచరించే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. విదేశీయులు సైతం కాషాయ వస్త్రాలు, రుద్రాక్షలు ధరించి వచ్చి మహాకుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించడం విశేషం. ప్రయాగ్‌రాజ్‌లో 144 ఏళ్లకు జరుగుతున్న ఆధ్యాత్మిక సంగమం ఒక విశ్వ సంబరంగా మారడం విశేషం. ఈ కుంభమేళాలో ఓ మహిళా సాధ్వి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నారు. కేవలం సాధువులకు మాత్రమే ప్రవేశం కల్పించే షాహీ స్నాన్‌లో ఆమెకు అవకాశం లభించింది. స్వామీజీలతో కలిసి రతంపై ఊరేగుతూ కనిపించి ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్నారు.

ఆమె పేరు హర్ష్ రిచారియా. నెట్టింట రిచారియా ఫొటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. రెండేళ్ల క్రితం ఆమె సన్యాసం స్వీకరించారట. తాను శాంతిని ఇష్టపడతానని.. మంత్రాలు పఠించడం ద్వారా తనకు సాంత్వన లభిస్తుందని హర్ష్ రిచారియా పేర్కొన్నారు. అయితే సాధ్వి హర్ష్‌ రిచారియా తీరుపై జ్యోతిష్య పీఠం శంకారాచార్య అవిముక్తేశ్వరానంద్‌ సరస్వతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పవిత్ర కుంభమేళాలో అందానికి ప్రాధాన్యత లేదని ఆయన స్పష్టం చేశారు. అధ్యాత్మికతకు మాత్రమే చోటు ఉంటుందని స్పష్టం చేశారు. సాధువులతో కలిసి రథంపై ఊరేగడాన్ని అవిముక్తేశ్వరానంద్ విమర్శించారు. షాహీస్నాన్‌లో పాల్గొనడం హిందూ ధర్మానికి విరుద్దమన్నారు. కుంభమేళాలో ఇలాంటి విషయాలకు ప్రాధాన్యత ఇవ్వడం తగదని శంకరాచార్య పేర్కొన్నారు.

Share this post with your friends