భగవంతుడు ఎంతటి కరుణా సముద్రుడో.. అంతటి కఠినాత్ముడని చెప్పే కథ ఇది..

అక్రూరుడు శ్రీ కృష్ణ పరమాత్మకి పరమ భక్తుడు, అత్యంత సన్నిహితుడు. అక్రూరుడు ఒకసారి ద్వారకకి వెళ్ళిన సమయంలో సత్యభామ ఆయనతో, ” శ్రీ కృష్ణుడు నా భవనానికి వచ్చి చాలా కాలమైనది. మీరు ఆయన వద్దకి వెళ్ళి నేను ఎదురుచూస్తున్నానని చెప్పండి. ఇంక ఒక ఘడియలో కృష్ణుడు రాకపోతే నేను ప్రాణాలు త్యజిస్తానని ” అని అన్నది. అక్రూరుడు తక్షణమే కృష్ణుని పిలుచుకుని రావడానికి వెళ్ళాడు. లీలావినోదుడైన కృష్ణుని మాయల వలన ఆయన ఎక్కడ వెతికినా కనపడలేదు. ఘడియ దాటిపోతే సత్యభామ అన్నంత పని చేసి తన ప్రాణాలను త్యజిస్తుందేమోనని భయపడ్డాడు అక్రూరుడు.

వెంటనే తానే కృష్ణునిగా మారి సత్యభామ వద్దకు వెళ్ళి ” రాచకార్యాలలో నిమగ్నమైవున్నాను. అవి పూర్తిచేసుకుని నేనే నీ మందిరానికి వస్తాను” అని శ్రీ కృష్ణుడు చెప్తున్నట్టుగా చెప్పి అక్రూరుడు వెళ్ళి పోయాడు. సత్యభామ అంతఃపురం నుంచి బయటకు రాగానే ఎదురుపడిన శ్రీ కృష్ణునితో తాను చేసిన పని చెప్పాడు. శ్రీకృష్ణుడు అక్రూరుడు చెప్పినది విని “భామ మొండిపట్టుదల తప్పు. ఆమెను సంతుష్టురాలను చేయడానికి నీవు చేసిన తంత్రము తప్పు. ఇద్దరూ ఇందుకు తగిన దండన అనుభవించకతప్పదు. వచ్చే జన్మలో నీవు అంధుడవై జన్మిస్తావు. అదే సమయంలో సత్యభామ మధురాపురి మహారాణి అంతఃపురంలోని పరిచారికగా జన్మిస్తుంది” అని శాపంయిచ్చాడు. ఆ అక్రూరుడే మరుజన్మలో ‘ సూరదాసు’ అనే వైష్ణవభక్తునిగా జన్మించాడు. ఆయనకి బాహ్యదృష్టి లేక పోయినా తన దివ్య దృష్టితో రాధాకృష్ణులను దర్శిస్తూ, ఆనందంతో వారి గుణగణాలను కీర్తిస్తూ ఎన్నో పాటలు రాశాడు. కష్టాలెన్ని అనుభవించినా కృష్ణుని మీద ఉన్న భక్తి, విశ్వాసాలను మార్చుకోలేదు.

మరొకచోట జన్మించిన సత్యభామ మధురాపురి మహారాణి అంతఃపురంలో పరిచారికగా సేవలు చేస్తూ ఉండి పోయింది. ఒకనాడు సూరదాసు.. మహారాజు సూరదాస్ గానాన్ని వినడానికి ఆహ్వానించాడు. సూరదాస్ తన భక్తి కీర్తనలు ఆలపించి అందరిని ఆనందంలో ముంచెత్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ప్రసన్న వదనంతో చక్రధారిగా దర్శనమిచ్చాడు. అంతవరకు గత జన్మలో చేసిన తప్పిదాలకు శిక్ష అనుభవించిన సూరదాసును, రాజుగారి కొలువులో సేవలు చేస్తున్న సత్యభామని కరుణించి తనలో ఐక్యం చేసుకున్నాడు. భగవంతుడు ఎంతటి కరుణా సముద్రుడో అంతటి కఠనాత్ముడు కూడా. స్వపర భేదం లేదు.తప్పు చేసినవారు శిక్ష అనుభవించక తప్పదు.

Share this post with your friends