
కొల్హాపూర్ శ్రీ మహా లక్ష్మి అసలెందుకు వైకుంఠాన్ని వీడి ఇక్కడ కొలువైందో తెలుసుకుందాం. అమ్మవారికి ఉన్న ఇతర పేర్ల గురించి కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు ఆలయ విశేషాల గురించి తెలుసుకుందాం. ఈ ఆలయం ప్రాచీనమైనదని తెలుసుకున్నాం కదా. సుమారు ఆరు వేల ఏళ్ల క్రితం నాటిది. ఈ ఆలయ ప్రాంగణంలో అత్యద్భుతమైన శిల్పకళ భక్తులను ఇట్టే ఆకట్టుకుంటుంది. నలు దిక్కులా నాలుగు గోపురాలతో పాటు మధ్యలో ఒక గోపురం కింద ఈ ఆలయం నిర్మితమైంది. ఒక్కొక్క గోపురం కింద ఒక్కో దేవత కొలువై ఉంది. తూర్పు గోపురం కింద శ్రీ మహలక్ష్మి, మధ్యలో కుమార మండపం, పడమర గణపతి, ఉత్తరం మహాకాళి దక్షిణ గోపురం కింద మహా సరస్వతి కొలువయ్యారు.
ఈ ఆలయంలో ఉపాలయాలు కూడా ఉన్నాయి. వాటిలో శ్రీ వేంకటేశ్వర స్వామి, నవగ్రహాలు, రాధాకృష్ణ, కాలభైరవ, వినాయకుడు, సింహవాహిని, తుల్జాభవానిలు కొలువై ఉన్నారు. ఇక గర్భాలయంలో శ్రీ మహాలక్ష్మిని ఎంతసేపు చూసినా తనివి తీరదట. సుమారు ఆరు అడుగుల ఎత్తైన వేదికపై రెండడుగుల పీఠం మీద లక్ష్మీదేవి చతుర్భుజాలతో సింహవాహినిగా కూర్చొని దర్శనమిస్తుంది. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. ఏడాదికి మూడు సార్లు సూర్యుని కిరణాలు నేరుగా అమ్మవారి ముఖంపై ప్రసరిస్తాయి. ఈ దృశ్యాన్ని చూసేందుకు ఆలయానికి భక్తులు పోటెత్తుతారు. గర్భగుడి గోడపై శ్రీ చక్రం ఉండటం ఇక్కడ ప్రత్యేకం.
