ఈ అమ్మవారి ఆలయంలో విగ్రహం ఉండదు.. మరి దేనిని పూజిస్తారంటే..

విగ్రహం లేని ఆలయాలు కూడా ఉంటాయా? వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా కూడా ఉంటాయి. భారతదేశంలో సతీదేవికి చెందిన మొత్తం 51 శక్తిపీఠాలు ఉన్నాయి. ఈ శక్తిపీఠాలన్నింటిలోనూ సతీదేవి వివిధ రూపాల్లో పూజలు అందుకుంటూ ఉంటుంది. అయితే ఓ ఆలయంలో మాత్రం కనీసం విగ్రహం కూడా లేకుండా పూజలు అందుకుంటూ ఉంటుంది. మరి అక్కడ ఎవరికి పూజ చేస్తారు? అంటారా? ఓ ఉయ్యాలకు పూజ చేయడం జరుగుతోంది. సతీదేవి మాతృ దేవత ఆలయం సంగం నగరం ప్రయాగ్‌రాజ్‌లో ఉంది. విశేషమేమిటంటే ఈ ఆలయంలో విగ్రహం లేదు.ఓ పౌరాణిక కథనం ప్రకారం విచారంగా ఉన్న శివుడు సతీదేవి మృతదేహంతో ప్రపంచం అంతా తిరుగుతున్నప్పుడు శ్రీ మహా విష్ణువు ఆయన దుఃఖాన్ని తగ్గించడానికి సతీదేవి మృతదేహాన్ని తన సుదర్శన చక్రంతో ముక్కలు చేశాడు.

సతీదేవి శరీరం ముక్కలైపోయి ఒక్కో భాగం ఒక్కో ప్రదేశంలో పడిపోయిదట. అయితే ప్రయాగరాజ్‌లో సతీదేవి కుడి చేతి పంజా చెరువులో పడి అదృశ్యమైంది. పంజా ఎక్కడ వెదికినా కనిపించకపోవడంతో ఈ ప్రదేశాన్ని సిద్ధ పీఠంగా భావించి అలోపి శంకరి దేవి ఆలయంగా నామకరణం చేశారు. ఇక ఇక్కడ భక్తులు ఊయలను పూజిస్తారు. గుడి చెరువు నుంచి నీటిని తీసుకొచ్చి ఊయలను అభిషేకించి ప్రదక్షిణలు చేస్తారు. ఈ ఊయలనే అమ్మవారి రూపంగా భావించి మొక్కుకుంటారు. ఇక్కడ కొబ్బరికాయ, సింధూరం సమర్పిస్తూ ఉంటారు. ఇక నవరాత్ర సమయంలో ఈ ఊయల అందమైన అలంకరణతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ ఊయల ముందు తమ చేతులకు రక్షా సూత్రాన్ని కట్టుకుంటే అమ్మవారు తమ కోరికలన్నీ నెరవేరుస్తుందని నమ్ముతారు.

Share this post with your friends