అమర్‌నాథ్ యాత్రకు వేళవుతోంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. జమ్మూకశ్మీర్‌లోని పహెల్‌గావ్ నుంచి 29 కి.మీ దూరంలో ఉంటుందీ క్షేత్రం. ఎత్తైన కొండపైన ఉన్న గుహలో మంచుతో ఏర్పడే శివలింగాన్ని సందర్శించడం అదృష్టంగా భావిస్తారు. ఈ క్రమంలోనే ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు అమర్‌నాథ్‌కు తరలివస్తారు. అయితే ఈ అమర్‌నాథ్ యాత్ర అంత సులువేమీ కాదు.. చాలా ప్రమాదకరమైనది. ఇక ఈ అమరానాథుని దర్శనం ఏడాదికి రెండు పర్యాయాలు మాత్రమే ఉంటుంది. సహజంగా మంచుతో ఇక్కడ శివలింగం ఏర్పడుతుంది. ఇక ఈ యాత్ర జూన్ 29 నుంచి ప్రారంభం కానుంది.
ఆగస్టు 19 వరకూ అమరనాథ్ యాత్ర కొనసాగనుంది. ఈ ఆలయంలో సైన్స్‌కు అందని అద్భుతాలు చాలా ఉన్నాయి. ఈ రహస్యాలను ఛేదించేందుకు చాలా మంది యత్నించారు కానీ ఎవరికీ సాధ్యపడలేదు. ఈ గుహలోనే పరమశివుడు తన అర్ధాంగి పార్వతికి అమరత్వం గురించి వివరించాడని పురాణాలు చెబుతున్నాయి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ అమరత్వం గురించి విన్న వారికీ మరణం ఉండదట. అయితే మనిషై పుట్టాక మరణం తప్పదు కాబట్టి ఇక్కడ అమరత్వం అంటే.. పునర్జన్మ లేకుండా జన్మరాహిత్యాన్ని పొందడమేనని చెబుతారు.