భారతదేశంలో ప్రతి ఒక్క ఆలయానికి ఓ చరిత్ర ఉంటుంది. కానీ కొన్ని ఆలయాల ప్రత్యేకత మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది. ఎన్నో రహస్యాలు ఇవి తమలో ఇముడ్చుకుని ఉంటాయి. ఓ ఆలయానికి స్వయంగా ద్రోణాచార్యుడి తనయుడు అశ్వత్థామ వస్తాడట. తొలి పూజ ఆయనే నిర్వహిస్తారట. అసలా ఆలయం ఎక్కడుంది? అశ్వత్థామ రాక వెనుక కారణమేంటో చూద్దాం. మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్ జిల్లాలో ఉన్న అసిర్‌ఘర్ కోటలో పురాతన శివాలయం ఉంది. ఈ కోట రామాయణ కాలంలో నిర్మించబడినదని నమ్మకం. ద్వాపర యుగంలో కృష్ణుడు ఇచ్చిన శాపం కారణంగా అశ్వత్థామ ఈ కోటలో సంచరిస్తాడని చెబుతారు.
ఇంతకీ ఆ శాపమేంటంటే.. మహాభారత యుద్ధంలో అశ్వత్థామ దొంగచాటుగా వెళ్లి పాండవులనుకుని ఉపపాండవులను సంహరిస్తాడు. దీంతో ఆగ్రహించిన శ్రీకృష్ణుడు కలియుగంలో కూడా సంచరించమని శపించాడట. ఆ శాప ఫలితంగానే అశ్వత్థామ ఈ కోటలో తిరుగుతూ బ్రహ్మ ముహూర్తంలో ఈ ఆలయానికి వచ్చి శివలింగానికి ప్రథమ పూజ చేస్తాడట. ఆలయ అర్చకులు వచ్చి తలుపు తెరిచే సమయానికి శివలింగంపై పువ్వులు, విభూది ఉంటుందట. అశ్వత్థామకు సంబంధించి ఇక్కడ రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ గుడి ఆవరణలో.. అడవుల్లో అశ్వత్థామను చూసే ప్రయత్నం చేస్తే వారి మానసిక స్థితి చెడిపోయి పిచ్చివారవుతారట.