శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఘనంగా అధ్యయనోత్సవాలు ప్రారంభం

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయం మాదిరిగానే తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలోనూ అధ్యయనోత్సవాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి అధ్యయనోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 20వ తేదీ వరకూ అధ్యయనోత్సవాలు జరుగనున్నాయి. మాఘ మాసంలో ఆలయంలో దివ్యప్రబంధాన్ని పారాయణం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలోనే నేటి నుంచి దివ్య ప్రబంధాన్ని పారాయణం చేస్తారు.

ఇందులో భాగంగా ప్రతిరోజూ రాత్రి 7.15 గంటలకు ఆలయంలోని కల్యాణమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారిని, సేనాధిపతివారిని, ఆళ్వార్లను వేంచేపు చేస్తారు. వారి సమక్షంలో దివ్యప్రబంధాన్ని పారాయణం చేస్తారు. ఇందులో భాగంగా ఫిబ్ర‌వ‌రి 7న చిన్నశాత్తుమొర, ఫిబ్రవరి 13న ప్రణయ కలహోత్సవం, ఫిబ్రవరి 17న పెద్ద శాత్తుమొర నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, తిరుమల శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ‌మతి శాంతి, ఏఈవో శ్రీ మునికృష్ణా రెడ్డి, సూపరింటెండెంట్ శ్రీ శేషగిరి, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ శ్రీ ధనంజయ, ఆల‌య అర్చ‌కులు పాల్గొన్నారు.

Share this post with your friends