తిరుమలలో భాగ్‌సవారి నిర్వహించడం వెనుక కథేంటంటే..

తిరుమలలో బ్రహ్మోత్సవాలు ముగిసిన వెంటనే భాగ్‌సవారీని అత్యంత వైభవంగా నిర్వహించారు. అసలు భాగ్‌సవారీ నిర్వహించడం వెనుక కథేంటో తెలుసుకుందాం. పురాణ ప్రాశస్త్యం నేపథ్యంలో స్వామివారి భక్తాగ్రేసరుడైన శ్రీఅనంతాళ్వారుల భక్తిని పరీక్షించడానికి శ్రీదేవి సమేతంగా శ్రీ వేంకటేశ్వర స్వామివారు అనంతాళ్వారు పూదోటకు మానవ రూపంలో విచ్చేశారు. తన పూదోటలో పూలు కోస్తున్న అమ్మవారిని అనంతాళ్వారువారు అశ్వత్త వృక్షానికి బంధిస్తాడు. అయితే స్వామివారిని పట్టుకోబోగా అప్రదక్షణ దిశలో పారిపోయి ఆలయంలో ప్రేవేశించి మాయమైపోతారు.

అనంతరం అనంతాళ్వారులు తన భక్తిని పరీక్షించడానికి విచ్చేసినది సాక్షాత్తు శ్రీ మలయప్ప స్వామివారేనన్న విషయం గ్రహించి పశ్చాత్తాపపడుతాడు. వెంటనే అమ్మవారిని బంధీ నుంచి విముక్తురాలిని చేసి, పూల బుట్టలో కూర్చోబెట్టి స్వయంగా స్వామివారి చెంతకు చేరవేస్తాడు. తన భక్తుని భక్తికి మెచ్చి స్వామివారు అతని కోరిక మేరకు బ్రహ్మోత్సవాల మరునాడు తాను అనంతాళ్వారుల తోటలోనికి అప్రదక్షణంగా విచ్చేసి తిరిగి ఆలయంలోనికి ప్రవేశిస్తానని అభయమిచ్చాడు. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకొని నిర్వహించే ఈ భాగ్‌సవారి ఉత్సవం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.

Share this post with your friends