తమిళనాడులోని చిదంబరంలోని శివాలయ ప్రత్యేకతలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పటికే వాటిలో నిరాకారుడై ఉన్న స్వామివారి గురించి అలాగే దేశంలో ఉన్న ఏకైక నటరాజాలయం ఇదేనని తెలుసుకున్నాం. ఇక ఈ ఆలయ మరో ప్రత్యేకత ఏంటంటే.. దేవాలయానికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 9 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. ఈ తొమ్మిది ద్వారాలు.. మానవునిలోని నవ రంధ్రాలకు ప్రతీకగా భావిస్తారు. ఈ ఆలయంలో ‘కనక సభ’లో 4 స్తంభాలుంటాయి. అవి నాలుగు వేదాలకు ప్రతీకలు అని పండితులు చెబుతారు.
పొన్నాంబళంలో 28 స్తంభాలుంటాయి. అవి 28 శైవ ఆగమాలకు ప్రతీకలు. అలాగే ఇక్కడి 9 కలశాలు.. 9 రకాల శక్తికి ప్రతీకలుగా ఉంటాయి. అలాగే మంటపంలోని 18 స్తంభాలు 18 పురాణాలకు ప్రతీకలని పేర్కొంటారు. ఇక్కడి నటరాజు భంగిమను కాస్మిక్ డ్యాన్స్‌గా పాశ్చాత్య శాస్త్రవేత్తలు అభివర్ణించారు. మరో ఆసక్తికర విషయం ఏంటో తెలుసా? శాస్త్రవేత్తలు చెప్పిన ఈ విషయాలన్నీ శాస్త్ర సమ్మతాలని నిరూపించేందుకు పాశ్చాత్య శాస్త్రవేత్తలకు ఎనిమిదేళ్లకు పైగా సమయం పట్టడం విశేషం. ఇక్కడి స్వామివారిని దర్శించుకుంటే చాలు.. మన పాపాలన్నీ పటాపంచలవుతాయట.