
నరకసంహారం అనంతరం ప్రజలంతా ఆనందోత్సాహాలతో పండుగ చేసుకున్నారు. శ్రీకృష్ణుడు, సత్యభామ నరకాసురుణ్ణి వధించారన్న విషయం అందరికీ తెలుసు కానీ ఎక్కడ అనేది మాత్రం చాలా మందికి తెలియదు. అదెక్కడో తెలుసుకుందాం. నరకాసురుడు ద్వాపరయుగానికి చెందిన వాడు. అప్పట్లో నరకుడు ప్రాగ్నోషికపురం అనే ప్రాంతాన్ని పాలించేవాడు. ఆ సమయంలో శివుడి కోసం నరకుడు ఘోర తపస్సు చేసి, తల్లి భూదేవి వల్ల తప్ప మరొకరి వల్ల మృత్యువు సంభవించకూడదనే వరాన్ని పొందుతాడు . అది అదనుగా చేసుకుని కనిపించిన మహిళలు దేవతలందరినీ హింసించేవాడు.
ఒకరోజు వేటకు వెళ్లి నరకుడు జంతువు కోసం బాణం వేస్తే అది గురి తప్పి బ్రాహ్మణుడికి తగిలి అతడు మరణిస్తాడు. బ్రాహ్మణ హత్య మహాపాతకంగా భావించిన నరకుడు కృష్ణానదీ తీరంలో ఉన్న నడకుదురుకు చేరుకుని పృథ్వీశ్వరస్వామిని పుష్కర కాలం పాటు పూజించాడు. ఆ సమయంలోనే మహిళలను బంధించి హింసించేవాడు. దీంతో ఆ ప్రాంతంలోని మహిళలంతా భయబ్రాంతులకు లోనై శ్రీకృష్ణుడిని శరణు వేడుకున్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు సత్యభామా సమేతుడై వచ్చి నరకాసురుడిని సంహరించి అక్కడి ప్రజలను రక్షించాడు. కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం నడకుదురును నరకాసురుని సంహరించిన ప్రదేశంగా చెబుతారు.
