జ్వాలా ముఖి శక్తి పీఠానికి సంబంధించిన పురాణ కథ ఏంటంటే..

హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాలో ఆధ్యాత్మిక జ్వాలలు వెలుగులు విరజిమ్మే జ్వాలాముఖి శక్తిపీఠం గురించి తెలుసుకున్నాం కదా. ఇక్కడ సతీదేవి జిహ్వ పడిపోయిందని చెబుతారు. ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉండదు. పర్వత గర్భం నుంచి వెలువడే నవరత్న జ్వాలలునే దేవి సాక్షాత్కారంగా నమ్ముతారు. సతి మాత తన తండ్రి దక్ష యజ్ఞంలో దహించుకున్నప్పుడు, శివుడు ఆమె శవాన్ని తీసుకుని విహరించాడు. విష్ణువు సుదర్శనచక్రంతో ఆ శరీరాన్ని 51 భాగాలుగా చేశాడు. అందులో జిహ్వా (గళం) ఈ ప్రదేశంలో పడింది. అందుకే జ్వాలాముఖి శక్తిపీఠం అని పేరు వచ్చింది.

ఇక్కడ నిర్వహించే ప్రత్యేక ఉత్సవాలు ఏంటంటే..

నవరాత్రులు – ఇక్కడి ప్రధాన ఉత్సవం. వేలాది మంది భక్తులు హాజరవుతారు. దీపావళి రోజున జ్వాలాదేవి జ్వాలలు మరింత ప్రబలంగా వెలుగుతాయని విశ్వాసం. తీర్థయాత్ర విశేషం ఏంటంటే.. జ్వాలాముఖి ఆలయం సందర్శించిన వారు తమలోని అజ్ఞానం ఆరిపోవడంతో పాటు, దైవ జ్ఞానం వెలిగిపోతుందని విశ్వసిస్తారు. “అమ్మవారి జ్వాలలలో ఒక్క చూపు చూసిన వాడెవడైనా పాపరహితుడవుతాడు” అని స్థానికులు చెబుతారు. జ్వాలాముఖి దేవిని దర్శించుకోవడం అనేది యాత్రికుల ఆత్మలోని చీకట్లను తొలగించి, భక్తిలో వెలుగులు నింపే దివ్యానుభవం.

Share this post with your friends