
తమిళనాడులోకి కుంభకోణంలో కొలువైన సారంగపాణి ఆలయం గురించి తెలుసుకున్నాం. ఇక్కడికి స్వామివారు రథంపై వచ్చి కొలువయ్యారట. కాబట్టి ఈ ఆలయం కూడా రథం ఆకారంలోనే ఉంటుంది. ఈ ఆలయ స్థల పురాణం గురించి తెలుసుకుందాం. భృగుమహర్షి వైకుంఠానికి వచ్చాడట. ఆ సమయంలో విష్ణుమూర్తి ఆయనను గమనించక లక్ష్మీదేవితో సరస సల్లాపాల్లో తేలియాడుతున్నాడట. అది చూసిన భృగు మహర్షికి పట్టరాని కోపం వచ్చిందట. అంతే ఏకంగా వైకుంఠనాధుని ఛాతీపై కాలితో తన్నాడ. అయితే విష్ణుమూర్తి ఏమాత్రం కూడా భృగు మహర్షిపై కోపం ప్రదర్శించలేదట. కానీ అమ్మవారికి మాత్రం పట్టరాని కోపం వచ్చిందట.
ఆగ్రహించిన అమ్మవారు భూలోకానికి వెళ్లిపోయారు. ఆమెను అన్వేషిస్తూ విష్ణుమూర్తి భూలోకానికి వచ్చి తిరుమల కొండల్లో స్వయంభువుగా అవతరించాడట. కొంతకాలం అనంతరం తన తప్పు తెలుసుకున్న భృగు మహర్షి.. అమ్మవారిని మన్నించమని వేడుకుని తన కుమార్తెగా జన్మించాలని కోరుకుంటాడు. దీంతో అమ్మవారు భృగువును తపస్సు చేయాలని ఆదేశించడంతో ఆయన కుంభకోణంలో తపస్సు నిర్వహించారట. అప్పుడు అమ్మవారు హేమ పుష్కరిణిలో చిన్న శిశువుగా భృగువుకు దొరకడంతో తీసుకెళ్లి కోమలవల్లి అని పేరు పెట్టి పెంచుకుంటాడు.అనంతర కాలంలో అమ్మవారి కోసం వైకుంఠం నుంచి రథంలో స్వామివారు అక్కడకు చేరుకోవడంతో వారిద్దరి వివాహం వైభవంగా జరిగింది. వైకుంఠం నుంచి వచ్చే సమయంలో చేతిలో సారంగం అనే విల్లును ధరించి ఉండటంతో సారంగపాణిగా పేరు వచ్చింది.
