కర్నూలు జిల్లా పాణ్యం మండల కేంద్ర నుంచి పాణ్యం నుండి 20 కి.మీ. దూరంలో కొత్తూరు గ్రామంలో సుబ్రహ్మణ్య స్వామి గురించి తెలుసుకున్నాం కదా. ఈ గ్రామస్తులు ఆదివారం నాడు మద్యం, మాంసం ముట్టరు. ఇలా తినకపోవడానికి వెనుక ఓ బలమైన కారణం ఉంది. అదేంటో తెలుసుకుందాం. అందరి మాదిరిగానే ఆదివారం ఈ గ్రామంలోని వారికి సైతం సెలవు. ఆదివారం మాంసాహారం ముట్టకపోగా.. అంత్యక్రియలు నిర్వహించకపోవడం ఈ పల్లెలో అనాదిగా వస్తున్న ఆచారం. అసలు ఈ పల్లెలో మాంసం అమ్మరు. ఆసక్తి కలిగించే ఈ ఆచారం వెనుక సుబ్రహ్మణ్య స్వామి ఆలయ స్థల పురాణ నేపథ్యం ఉంది.
500 ఏళ్ళ క్రితం కొత్తూరు గ్రామానికి చెందిన బీరం చెన్నారెడ్డి అనే రైతు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనేవాడు. ఇక ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కలేక తనకు ఏదో ఒక తరుణోపాయం చూపాలని ఓ బ్రాహ్మణుడిని ఆశ్రయించాడు. మాఘ మాసంలో షష్ఠి రోజున పొలం దున్నితే కష్టాలు తొలగుతాయని చెన్నారెడ్డికి బ్రాహ్మణుడు సూచించాడు. దీంతో చెన్నారెడ్డి కాడెద్దులను నాగలికి కట్టి పొలం దున్నడం ప్రారంభించాడు. అప్పుడు నాగలికి ఏదో తలిగింది. అదేంటా అని చూడగా 12 తలల నాగుపాము రూపం ప్రత్యక్షమైంది. ఆ తేజస్సుకు రైతు కంటిచూపు కోల్పోయాడట. కాసేపటికి చుట్టు పక్కల రైతులు వచ్చి నాగలిని వెనక్కులాగి చూడగా.. అక్కడ 12 శిరస్సుల నాగేంద్రుడి విగ్రహం బయట పడింది.