
మనం ఇంతకు ముందే రావణాసురుడి లంకలో కూడా సీతాదేవి ఆలయం ఒకటుందని తెలుసుకున్నాం. శ్రీలంకలో సీతా అమ్మాన్ ఆలయం ఉందని.. ఇది రావణాసురుడు ఆమెను బంధీ చేసిన ప్రాంతమని చెప్పుకున్నాం. అయితే ఈ ఆలయ పూర్తి విశేషాలు తెలుసుకుందాం. సీతమ్మను రావణాసురుడు బంధీ చేసిన ప్రాంతంలో లక్షల సంఖ్యలో అశోక వృక్షాలు కనిపిస్తాయి. ఇక ఇక్కడి సీతా అమ్మాన్ ఆలయం 5 వేల ఏళ్ల నాటిదని చెబుతారు. ఈ ఆలయాన్ని సీతా ఎలియా అని కూడా చెబుతారు. ఈ ఆలయంలో ఉన్న సీతమ్మతో పాటు రామ, లక్ష్మణుల విగ్రహాలు 5 వేల ఏళ్ల నాటివని నమ్మకం.
సీతను బందీగా ఉంచిన ఐదు ప్రదేశాలలో ఇది కూడా ఒకటని చెబుతారు. రావణుడి రాజభవనం ఉన్న ఆలయానికి ఎదురుగా ఒక పర్వతం ఉంటుందట. దానిపై హనుమంతుని పాదముద్రలు కనిపిస్తాయని చెబుతారు. ఈ సీతా ఎలియా ప్రాంతాన్ని హిందూ పురాణాల్లో అశోక వనంగా పిలుస్తారు. అలాగే హనుమంతుడు లంకలో తొలుత అడుగు పెట్టిన ప్రదేశం కూడా ఇదేనట. సీతా ఎలియా ఆలయ సమీపంలో ఒక నది ప్రవహిస్తోంది. ఈ నదిని సీతా నది అని పిలుస్తారు. ఈ నదీ తీరంలోని మట్టి పసుపు రంగులో ఉంటుంది. ఈ నదిలో సీతమ్మ రోజు స్నానమాచరించి రోజూ ప్రార్థనలు చేసేదని నమ్మకం.
