సుబ్రహ్మణ్యస్వామి విగ్రహాన్ని సముద్రంలో పడేసిన డచ్‌వారు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

తమిళనాడులోని తూత్తుక్కుడి నుంచి 40 కిలోమీటర్ల దూరంలో తిరుచెందూర్‌లోని సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయ స్థల పురాణం గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు స్వామివారి మహిమేంటో తెలుసుకుందాం. ఈ సుబ్రహ్మణ్య స్వామి అత్యంత మహిమాన్వితమైన ఆలయమని చెబుతారు. దీనికి ఓ కథ కూడా ఉంది. అదేంటంటే.. 1646 – 1648 మధ్య తిరుచెందూర్ మురుగన్ ఆలయాన్ని డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఆక్రమించారు. అప్పట్లో డచ్ వర్సెస్ పోర్చుగీసువారికి మధ్య యుద్ధం జరిగింది. ఆ సమయంలో పోర్చుగీసువారు ఈ ఆలయంలోనే ఆశ్రయం పొందారట. వీరిని ఖాళీ చేయించేందుకు స్థానికులు ఎంతగానో ప్రయత్నించారట.

రోజు రోజుకూ పెరుగుతున్న ఒత్తిడితో డచ్ వారు ఆలయంలోని సంపదలతో పాటు ప్రధాన విగ్రహాన్ని సైతం అపహరించి తమ వెంట తీసుకు వెళ్లిపోయారు. స్వామివారి విగ్రహంతో కలిసి సముద్ర మార్గంలో డచ్ వారు ప్రయాణిస్తున్నారట. ఆ సమయంలో పెద్ద తుపాను వచ్చిందట. దీంతో వారిని భయభ్రాంతులకు గురి చేసిందట. అసలు తుపాను విపత్తుకు కారణం మురుగన్ విగ్రహమేనని భావించిన డచ్ వారు భయంతో దానిని సముద్రంలోకి విసిరేశారట. కొద్ది రోజుల తర్వాత స్వామివారు మలయప్పన్ అనే భక్తుడి కలలోకి వచ్చి తనను సముద్రంలో నుంచి వెలికి తీయాలని చెప్పారట. సముద్రంలో తనను కనుకొనడానికి తను ఉన్న ప్లేస్‌లో పైన గరుడ పక్షి సంచరిస్తూ ఉంటుంది. సముద్రంపై నిమ్మకాయ తేలియాడుతూ ఉంటుంది. అక్కడ తానుంటానని చెప్పాడట. అక్కడ వెదకగా నిజంగా స్వామివారి విగ్రహం దొరికిందట. విగ్రహాన్ని వెలికి ఆలయంలో ప్రతిష్టించారట. ఈ కథంతా ఆలయ గోడలపై మనకు కనిపిస్తుంది.

Share this post with your friends