
శంఖాన్ని మనవాళ్ళు ఓంకారంతో పోలుస్తుంటారు. ఆ ఓంకారం ఎలా ఉంటుంది అంటే దాన్ని అనుష్టించినప్పుడు మనదైన ఈ శరీరమనే భూమి ఒక్కసారి వణుకుతుంది, ఇందులో ఉండే అపార్థములు తొలగుతాయి, జ్ఞానం ప్రకాశిస్తుంది. ఓంకారం ఏం చెబుతుందంటే అకారమైన పరమాత్మకే మకారమైన నేను చెందినవాణ్ణిగా అన్ని అవస్తలయందు వాడి సేవ చేయవలె. ఇదే శేశత్వాన్ని తెలుపుతుంది. తన పాంచజన్యాన్ని పోలిన శంఖాలు అడుగుతున్నారు, ఇది ఇవ్వడం కష్టం అని అను కున్నాడు స్వామి, సరేలే ఇంకా ఏమేమి కావాలో ఒకేసారి చెప్పండి అని కృష్ణుడు అడిగాడు.
మాకు ఇంకా “పోయ్ ప్పాడుడైయనవే శాలప్పెరుం పఱైయే” శక్తివంతమైన చాలా పెద్ద వాయిద్యం కావాలి, ఇంకా “పల్లాండిశైప్పారే” పల్లాండు పాడేవారు కావాలి, ఇంకా “కోలవిళక్కే” ఆరని నిలువు దీపం కావాలి. గోష్టితో వెళ్ళేప్పుడు మంగళకరంగా ఒక దీపం ఉండాలి కదా అందుకు, ఇంకా మేం ఉన్నట్లు తెలిసేలా “కొడియే” ద్వజం కావాలి, ఇంకా “వితానమే” మంచు పడకుండా గొడుగు కావాలి అని అడిగారు. మీరు అడిగినవి ఒక్కోటి ఇవ్వడం కష్టం అని చెప్పేసాడు శ్రీకృష్ణుడు. ఎమయ్యా నీవెవరవో మాకు తెలియదని అనుకున్నావా, “ఆలిన్-ఇలైయాయ్” అన్నిలోకాలను నీ పొట్టలో పెట్టుకొని అప్పుడప్పుడే వికసించిన వటదలం పై శయనించగలిగావు, తిరిగి ఇన్ని లోకాలను బయటికి తేగలిగావు, మేం అడిగినవి ఇవ్వలేవా నీ సామర్థ్యం ఏంటో మాకు తెలుసు, నీవు అనుకుంటే జరగనిదిలేదు, నీవు వద్దు అనుకుంటే జరిగేది ఏమిలేదు అంతా “యరుళ్” నీ దయ అని స్వామిని కోరారు.
ఇక వీళ్ళకు ఇవ్వక తప్పదు అని ఇది వరకు ఊర్లో కోవెలలో ఉన్న శంఖాన్ని ఒకటి తెప్పించి ఇచ్చాడు, తన దగ్గర ఉన్న కొంబుబూర ఒకటి ఇచ్చాడు, స్వామి సంబంధం కలవి కాభట్టి వీళ్ళు ఆనందించారు. ఇక వాయిద్యం తను వెన్న తినేప్పుడు చేసే ఘట నృత్యం అప్పుడు వాడే వాయిద్యాన్ని ఇచ్చాడు. ఇక పల్లాండుకు, రాబోయే కాలంలో రామానుజ సంపర్కంచే ఏర్పడే భక్త గోష్టికి మంగళం పాడిన నమ్మాళ్వార్ ను పంపాడు. ఇక ఆరని దీపం అడిగారు కదా అమ్మను వీళ్ళతో పంపాడు, ఇక ద్వజానికి గుర్తుగా గరుత్మంతుడిని పంపాడు. గొడుగుగా ఆదిశేశుడు వెళ్ళడు కనక, తాను దరించి విడిచిన శేషవస్త్రం ఒకటి ఇచ్చాడు, స్వామి సంబంధం కలవి కాభట్టి వీళ్ళకు అదే చాలు.
