వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక వసంతోత్సవాలు ప్రారంభం

శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక వసంతోత్సవాలు నేడు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు ఈనెల 29వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. ప్రతిరోజూ ఉదయం 8.30 గంటలకు ఉత్సవర్లు ఆలయం నుంచి వసంత మండపానికి వేంచేపు చేస్తారు. తొలి రెండు రోజులు శ్రీవారు ఉభయనాంచారులతో కలిసి వసంతోత్సవంలో పాల్గొంటారు. చివరి రోజు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి, సీతాలక్ష్మణ హనుమాన్‌ సమేత శ్రీరామచంద్రమూర్తి, రుక్మిణీ సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామివార్ల ఉత్సవమూర్తులను వసంత మండపానికి వేంచేపుగా తీసుకొచ్చి వేదపండితులు శాస్త్రోక్తంగా ఆస్థానం నిర్వహిస్తారు.

వసంత రుతువులో లభించే పుష్పాలు, ఫలాలను సమర్పించి స్వామివారి దివ్యానుగ్రహం పొందడమే ఈ వసంతోత్సవం అంతరార్థం.కాగా, రెండో రోజు మే 28వ తేదీ సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు స్వర్ణ రథోత్సవం కన్నులపండువగా జరుగనుంది. ప్రతిరోజూ మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు స్నపన తిరుమంజనం, సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు ఊంజలసేవ, రాత్రి 7 నుంచి 8 గంటల వరకు వీధి ఉత్సవం నిర్వహిస్తారు. వసంతోత్సవాల సంద‌ర్భంగా నేటి నుంచి 29వ తేదీ వ‌ర‌కు కల్యాణోత్సవం, మే 28న స్వర్ణపుష్పార్చన, మే 29న అష్టోత్తర శతకలశాభిషేకం, ఆర్జితసేవలను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది.

Share this post with your friends