
దైవ సన్నిధికి చేరుకోవడానికి తొమ్మిది మార్గాలు ఉన్నాయని నారద భక్తి సూత్రాల ద్వారా తెలుస్తోంది. అవి-శ్రవణం, కీర్తనం, స్మరణం, పాద సేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదన. ఈ మార్గాల ద్వారా భగవంతుని చేరుకోవచ్చని భాగవతం సైతం సూచించింది.
భక్తుడు తన అవకాశాన్ని బట్టి వీటిలో ఏ మార్గాననైనా ఎంచుకోవచ్చు. శ్రవణం అంటే వినడం. దైవం గూర్చి విషయాలు, లీలలు, కథలు మొదలైన వాటిని తన్మయత్వంతో వినడం కూడా భగవంతుని అర్చించినట్లే అవుతుంది.
ప్రహ్లాదుడు తల్లి కడుపులో ఉన్నప్పుడే భగవంతుడు విషయాలను నారదుడు ద్వారా విన్నాడు. శుక మహర్షి ఏడు రోజులలో చెప్పిన భాగవత పురాణాన్ని విని పరీక్షత్తు ముక్తుడయ్యాడు. ధర్మరాజు, జనమేజయుడు మొదలైన వారంతా దైవం గురించి విని తరించిన వారే. భగవంతుని గొప్పదనాన్ని నోరార చెప్పడమే కీర్తనం. నిత్యము భగవంతుని సుగుణాలను తలుచుకుంటూ వాటి గురించి మాట్లాడడం, సంకీర్తన చేయడం లాంటి చర్యల వలన మనసు భగవంతుడి మీద సులభంగా లగ్నమవుతుంది. ఈ మార్గంలో ముక్తి పొందినవాడు శుక మహర్షి, మీరాబాయి, త్యాగరాజు, అన్నమయ్య, కంచర్ల గోపన్న వంటి వారంతా భగవంతుని కీర్తించి తరించిన వారే.
