శ్రీవారి గరుడసేవ రోజున సమన్వయ సమస్యలు తలెత్తకుండా చర్యలు

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు విశేష సేవలు అందించాలని, విధులను నిర్వర్తించడంతో పాటు, డిప్యూటేషన్ సిబ్బంది తమ పరిసరాలపై నిఘా ఉంచి, అప్రమత్తంగా ఉండాలని, సమస్యను పరిష్కరించడంలో ప్రముఖ పాత్ర పోషించాలని టిటిడి ఈవో శ్రీ జె శ్యామలరావు అన్నారు. తిరుమల ఆస్థాన మండపంలో గురువారం సాయంత్రం బ్రహ్మోత్సవాల విధులకు హాజరైన ఉద్యోగులను ఉద్దేశించి ఈఓ మాట్లాడుతూ, శ్రీ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలను నిర్వహించేందుకు పోలీసులు, జిల్లా యంత్రాంగంతో టీటీడీ డిప్యూటేషన్ సిబ్బంది సమన్వయంతో పని చేయాలని ఉద్యోగులకు పిలుపునిచ్చారు.

అనంతరం అదనపు ఈఓ శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, సివిఎస్‌వో శ్రీ శ్రీధర్‌లు మాట్లాడుతూ గతంలో బ్రహ్మోత్సవాల సమయంలో ముఖ్యంగా గరుడసేవ రోజున ఉండే సమన్వయ సమస్యలు ఈసారి తలెత్తకుండా చర్యలు తీసుకున్నామని డిప్యుటేషన్ అధికారులకు తెలిపారు. ఈ బ్రహ్మోత్సవాలను సమిష్టి కృషితో తమ తమ విధులు నిర్వర్తించి విజయవంతంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జేఈఓలు శ్రీమతి గౌతమి, శ్రీ వీరబ్రహ్మం, సీఈ శ్రీ సత్యనారాయణ, ఎఫ్‌ఏసీఏవో శ్రీ బాలాజీ, సీపీఆర్‌వో డాక్టర్‌ టి రవి, క్యాటరింగ్‌ ప్రత్యేక అధికారి శ్రీ జిఎల్‌ఎన్‌ శాస్త్రి, ఇతర ఉన్నతాధికారులు, డిప్యూటేషన్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Share this post with your friends