నేటి నుంచి శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి సాక్షాత్కార వైభవోత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ ఉదయం 10 నుంచి 11 గంటల వరకూ శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే ఇవాళ్టి నుంచి నాలుగు రోజుల పాటు అంటు ఈ నెల 13 వరకూ స్వామివారి ఆర్జిత కల్యాణోత్సవం సేవను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది. ఇవాళ్టి నుంచి 12వ తేదీ వరకూ స్వామివారికి వివిధ రకాల వాహన సేవలను టీటీడీ నిర్వహించనుంది.
ఇవాళ మలయప్ప స్వామి భూదేవి, శ్రీదేవి సమేతుడై పెద్ద శేష వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించనున్నారు. ఇక శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సాక్షాత్కార వైభవోత్సవాల మరుసటి రోజైన జూలై 13వ తేదీన పార్వేట ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీవారి మెట్టు సమీపంలోని మండపంలో ఉదయం 7 నుంచి ఈ ఉత్సవం పెద్ద ఎత్తున జరగనుంది. ఈ సందర్భంగా ప్రత్యేక ఆస్థానం, పార్వేట ఉత్సవం ఘనంగా నిర్వహిస్తారు.