తిరుమలలోని వరాహ స్వామివారి ఆలయంలో వరాహ జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి. భాద్రపద శుద్ధ తదియ రోజు వరాహ జయంతిగా జరుపుకుంటాం. ఆదివరాహ క్షేత్రమైన తిరుమలలోని శ్రీ భూ వరాహ స్వామివారి ఆలయంలో గురువారం ఉదయం వరాహ జయంతి శాస్త్రోక్తంగా జరిగింది. ఇందులో భాగంగా ఉదయం కలశస్థాపన, కలశ పూజ, పుణ్యాహవచనం చేపట్టారు. అనంతరం వేదమంత్రాల నడుమ మూలవర్లకు పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో విశేషంగా అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
బమ్మెర పోతన రచించిన భాగవతం ప్రకారం మహా ప్రళయం సంభవించి భూమి జలంలో మునిగిపోయింది. దీంతో బ్రహ్మదేవుడు జగత్తుకు ఆధారమైన భూమండలాన్ని తిరిగి పైకి తీసుకొచ్చేందుకు యత్నించాడు. దీనికోసం పుండరీకాక్షుని స్మరిస్తూ.. ధ్యాన నిమగ్నుడై ఉన్న బ్రహ్మ నాసిక నుంచి, బొటనవేలు పరిమాణమున్న వరాహంగా శ్రీహరి లోకోద్ధరణకై ఉద్భవించాడు. దేవలతలంతా చూస్తుండగా ఆశ్చర్యకరంగా బొటనవేలు పరిమాణమున్న వరాహం కాస్తా క్షణం లోపలే ఏనుగంత పెద్దగా పెరిగింది. అనంతరం హిరాణ్యాక్షుడిని సంహరించాడు వరాహస్వామి. ఆపై భూమిని తన కోరలపై నిలిపి సముద్ర గర్భం నుంచి భూమిని పైకి తీసి ఉద్దరించాడు. అనంతరం స్వామి తిరుమల కొండపై సంచరించినట్లుగా ఆధారాలున్నాయి.