విశాఖపట్టణంలోని సింహాచలంలో ప్రసిద్ధి గాంచిన దేవస్థానాల్లో ఒకటి శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వార్షిక కళ్యాణ మహోత్సవం నేడు అంగరంగ వైభవంగా జరగనుంది. దీనికోసం దేవస్థానం అన్ని ఏర్పాట్లనూపూర్తి చేసింది. ప్రతి ఏటా సంప్రదాయబద్ధంగా, శాస్త్రోక్తంగా వార్షిక కల్యాణ మహోత్సవాలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగానే ఇవాళ సాయంత్రం స్వామివారి రథోత్సవం.. అనంతరం కళ్యాణ మహోత్సవం జరగనుంది. రాత్రి 8 గంటలకు రధోత్సవం.. అనంతరం 9.30 గంటలకు కల్యాణోత్సవం నిర్వహిస్తారు.
స్వామి వారికి జరిగే ప్రధాన ఉత్సవాల్లో భాగమైన కల్యాణ మహోత్సవాన్ని తిలకించడానికి రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు తరలి వస్తుంటారు. వారికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. కాగా స్వామివారి వార్షిక కల్యాణ మహోత్సవాలు నిన్నటి నుంచే ప్రారంభమయ్యాయి. ఈ నెల 24వ తేదీ వరకూ ఈ ఉత్సవాలు జరుగనున్నాయి. ఇక ఇవాళ ఉదయం 6:30 నుంచి 7:30 వరకూ స్వామివారి ఎదురు సన్నాహోత్సవము కన్నుల పండువగా జరిగింది. వరాహ లక్ష్మీనరసింహస్వామివారు సింహాద్రి అప్పన్నగా స్వామివారు చాలా ప్రాచుర్యం పొందారు. సింహగిరి పర్వతంపై సముద్ర మట్టానికి 244 మీటర్ల ఎత్తులో అప్పన్న స్వామి ఆలయం ఉంది. దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన వైష్ణవ ఆలయాల్లో సింహాద్రి అప్పన్న ఆలయం కూడా ఒకటి.