కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గం కృత్తివెన్ను మండలం లక్ష్మీపురం గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ కనక పెన్నమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. 19వ తేదీ నుంచి జాతర మహోత్సవం ప్రారంభం కానుంది. జాతర నేపథ్యంలో ఆలయాన్ని పెద్ద ఎత్తున అలంకరించారు. గుడి ప్రాంగణమంతా లైటింగ్‌తో అలంకరించారు. గ్రామదేవతకు పెద్ద ఎత్తున సముద్ర స్నానం చేయించారు. దీనికి గ్రామ ప్రజలంతా హాజరయ్యారు. ఒక వేడుకలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
డప్పు వాయిద్యాలతో లక్ష్మీపురం గ్రామం కోలాహలంగా మారింది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి సైతం ప్రజలు అమ్మవారి జాతర మహోత్సవానికి హాజరవుతున్నారు. ఈ నెల 19వ తేదీన అంటే రేపు మధ్యాహ్నం 2:15 గంటలకు బంగారు వెంకమ్మ తల్లి జాతర (సాగనంపుట) ప్రారంభమవుతుంది. అనంతరం 20వ తేదీ అంటే సోమవారం ఉదయం 4 గంటలకు పోతురాజు జాతర మహోత్సవం జరుగుతుంది. అదే రోజున ఉదయం 11:35 గంటలకు శ్రీశ్రీశ్రీ కనక పెన్నమ్మ అమ్మవారి జాతర (సాగనంపుట) జరుగుతుందని గ్రామ పెద్దలు వెల్లడించారు.