అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ ఉదయం సింహ వాహనంపై స్వామివారు భక్తులను అనుగ్రహించారు. ఇవాళ సాయంత్రం ముత్యపు పందిరి వాహనంపై భక్తులను కటాక్షించనున్నారు. మంగళవారం రాత్రి సరస్వతి అలంకారంలో స్వామివారు హంస వాహనంపై భక్తులను అనుగ్రహించారు. రాత్రి 7 గంటలకు వాహనసేవ ప్రారంభమైంది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. వాహన సేవలో ఏఈవో శ్రీ రమేష్, సూపరింటెండెంట్ శ్రీమతి వాణి, కంకణ భట్టర్ శ్రీ సూర్య కుమార్ ఆచార్యులు టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ శివకుమార్ పాల్గొన్నారు.
నిన్న ఉదయంచిన్న శేష వాహనంపై మోహన కృష్ణుడి అలంకారంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి దర్శనమిచ్చారు. మంగళవారం ఉదయం 8 గంటలకు స్వామివారు ఐదు తలల చిన్నశేష వాహనంపై మోహన కృష్ణుడి అలంకారంలో దర్శనమిచ్చారు. చిన్నశేష వాహనం శ్రీవారి వ్యక్తరూపమైన పాంచభౌతిక ప్రకృతికి సంకేతం. కనుక ఈ వాహనం పంచభూతాత్మకమైన విశ్వానికి, అందులో నివసించే జీవునికి వరాలిస్తుంది. పంచశిరస్సుల చిన్నశేషుని దర్శనం మహాశ్రేయస్కరం. అనంతరం సాయంత్రం 5.30 నుంచి 6.30 గంటల వరకు ఊంజల్‌సేవ జరగనుంది. వాహనసేవలో ఆలయ ఏఈవో శ్రీ రమేష్, సూపరింటెండెంట్ శ్రీమతి శ్రీవాణి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ శివ కుమార్ పాల్గొన్నారు.