
ఇవాళ శ్రీ విఖనసాచార్యుల సన్నిధికి శ్రీ మలయప్పస్వామి వారు వేంచేయనున్నారు. ఆగస్టు 20న గాయత్రి జపాన్ని పురస్కరించుకుని శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారు మంగళవారం సాయంత్రం సహస్ర దీపాలంకార సేవ అనంతరం ఉత్తర మాడ వీధిలో గల శ్రీ విఖనసాచార్యుల సన్నిధికి వేంచేపు చేయనున్నారు. సోమవారం శ్రీ విఖనస మహర్షి జయంతి జరిగింది. ఆ మరుసటి రోజు స్వామి, అమ్మవార్లు శ్రీ విఖనసాచార్యుల సన్నిధికి వేంచేపు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా అక్కడ ఆస్థానం నిర్వహించి నివేదన చేపడతారు.
శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమం ప్రకారం నిత్యకైంకర్యాలు, సేవలు, ఉత్సవాలు జరుగుతాయి. ఈ వైఖానస ఆగమశాస్త్రాన్ని శ్రీ విఖనస మహర్షి రచించారు. తిరుమలలో సోమవారం శ్రీ విఖనస మహర్షి జయంతిని పురస్కరించుకుని ఆస్థాన మండపంలో టీటీడీ అళ్వార్ దివ్య ప్రభంద ప్రాజెక్టు, శ్రీ వైఖానస దివ్య సిద్ధాంత వివర్ధని సభ సంయుక్త ఆధ్వర్యంలో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ వైఖానస దివ్య సిద్దాంత వివర్ధని సభ కార్యదర్శి శ్రీ శ్రీనివాస దీక్షితులు ప్రసంగిస్తూ, ఆగమాలలో అతి ప్రాచీనమైనది వైఖానస ఆగమమని ఇందులో చెప్పబడ్డ విధివిధానాలు మనవ మనగడకు, సోపానానికి ఎంతో ఉపయోగమని వైఖానసకల్ప సూత్రంలో ఉపదేశించారని చెప్పారు. ఈ వైదిక విధానం మరెక్కడ చెప్పబడలేదని, ఇది అత్యంత వేదోక్త వైఖానస సిద్దాంతమని వివరించారు.
