తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీ ఆండాళ్ అమ్మవారి తిరువడిపురం ఉత్సవం ముగింపు సందర్భంగా బుధవారం ఘనంగా శాత్తుమొర జరిగింది. ఇందులోభాగంగా ఉదయం శ్రీ గోవిందరాజ స్వామివారు, శ్రీ ఆండాళ్ అమ్మవారి ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం 4 గంటలకు శ్రీ గోవిందరాజస్వామివారు, శ్రీ ఆండాళ్ అమ్మవారిని అలిపిరికి ఊరేగింపుగా తీసుకెళ్లి అక్కడ ఆస్థానం నిర్వహించారు. అనంతరం అలిపిరి నుంచి గీతామందిరం, రామనగర్ క్వార్టర్స్, వైఖానసాచార్యుల వారి ఆలయం, ఆర్‌ఎస్ మాడ వీధి, చిన్నజీయర్ మఠం మీదుగా ఊరేగింపు తిరిగి ఆలయానికి చేరుకుంది.
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈవో శ్రీ మునికృష్ణా రెడ్డి, సూపరింటెండెంట్లు శ్రీ నారాయణ, శ్రీ మోహన్ రావు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ ధనంజయ పాల్గొన్నారు. ఇక ఆన్‌లైన్‌లో టికెట్ల బుకింగ్ విషయంలో మధ్యవర్తులను సంప్రదించవద్దని టీటీడీ పదే పదే కోరుతోంది. ఇటీవలి వెరిఫికేషన్‌లో 545 మంది యూజర్ల ద్వారా దాదాపు 14,449 అనుమానిత శ్రీవాణి లావాదేవీలు జరిగినట్లు గుర్తించడంతో వాటన్నింటినీ బ్లాక్ చేసి వారికి మెసేజ్ ఫార్వర్డ్ చేసింది. అనుమానిత వ్యక్తులు దర్శనానికి వస్తే మరింత పటిష్టంగా విజిలెన్స్ తనిఖీలు నిర్వహిస్తోంది.