రేపు తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో శ్రావణ పౌర్ణమి గరుడసేవ

తిరుమల శ్రీ‌వారి ఆల‌యంలో ఆగ‌స్టు 19వ తేదీన శ్రావ‌ణ‌ పౌర్ణమి గరుడసేవ జరుగనుంది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడసేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.రాత్రి 7 నుండి 9 గంట‌ల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు సువర్ణకాంతులీనుతున్న గ‌రుడునిపై తిరుమాడ వీధులలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ నెలలో శ్రీవారికి రెండో సారి గరుడ సేవ జరుగనుండటం విశేషం. శ్రీ వేంకటేశ్వర స్వామివారికి అత్యంత ఇష్టమైన వాహనాల్లో గరుడ వాహనం ఒకటి.

పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞాన వైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు. కాబట్టి శ్రీవారి గరుడ సేవను తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తిరుమల శ్రీ మలయప్ప స్వామివారి ఆలయానికి చేరుకోనున్నారు.

Share this post with your friends